ఈ కమెడియన్ని వాడుకోండయ్యా

తెలుగు సినిమాల్లో ఒకప్పుడున్న కామెడీ వైభవం.. ఇండియాలోని ఇతర భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే మరే సినీ పరిశ్రమలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకే సమయంలో పదుల సంఖ్యలో కమెడియన్లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. కానీ ముందు తరం కమెడియన్లలో చాలామంది కాలం చేయగా.. బ్రహ్మానందం సహా మిగతా లెజెండరీ కమెడియన్లు సైడ్ అయిపోయారు. 

ఒకప్పట్లా కామెడీ రాసే, తీసే రచయితలు- దర్శకులు తగ్గిపోయారు. అలాగే ఇప్పుడు కామెడీ స్టైల్ కూడా మారిపోయింది. ఇప్పటి యూత్‌ను నవ్వించే కమెడియన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇప్పుడంతా సత్యదే హవా. అతను కాకుండా వెన్నెల కిషోర్ ఒక్కడే బిజీగా ఉంటున్నాడు. మిగతా కమెడియన్లలో కన్సిస్టెన్సీ తక్కువే. ఐతే ఈ ఇద్దరికీ ఏమాత్రం తీసిపోని కామెడీ టైమింగ్ ఉన్నా, యూత్‌కు ఫేవరెట్ అయినా.. ఎందుకో అవకాశాలు రాక రేసులో వెనుకబడిపోయాడు అభినవ్ గోమఠం.

అభినవ్ కామెడీ టైమింగ్ ఎంత ట్రెండీగా ఉంటుందో.. చాలా సింపుల్‌గా అతను ఎలా నవ్వించగలడో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా.. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ రుజువు. కానీ ఇంత మంచి కమెడియన్ని ఇండస్ట్రీ సరిగా వాడుకోలేదనే చెప్పాలి. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత అవ్వాల్సింత బిజీ అవ్వలేదతను. ఈ తరహాలో  చెప్పుకోవడానికి పెద్దగా మూవీస్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’తో అభినవ్ తనేంటో రుజువు చేశాడు. 

ఈ సినిమాలో హీరో విశ్వక్సేన్ సహా అందరినీ డామినేట్ చేస్తూ సినిమాలో తాను కనిపించే ప్రతి సన్నివేశంలో కామెడీ అదరగొట్టేశాడు అభినవ్. కౌశిక్ పాత్రలో తన బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్.. అన్నీ కూడా వేరే లెవెల్. తన ఇంట్రో సన్నివేశంలోనే కౌశిక్ కడుపుబ్బ నవ్విస్తాడు. థాయిలాండ్ నేపథ్యంలో సాగే సెకండాఫ్‌లో అయితే అభినవ్ చెలరేగిపోయాడసలు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఇంత మంచి కమెడియన్ని ఇండస్ట్రీ ఎందుకు ఉపయోగించుకోలేదన్న సందేహం కలుగుతుంది. ‘ఈఎన్ఈ రిపీట్’లో అభినవ్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూశాక అయినా తనకు మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తారేమో చూడాలి.