టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్షతోపాటు 95 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు, బాధితుడి కోర్టు ఖర్చులను కూడా గణేష్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో గతంలో కూడా జరిమానా, జైలు శిక్ష పడింది. అయితే, ఆయన ఆ కేసుల్లో బెయిల్ పై ఉన్నారు.
2018లో ప్రకాశం జిల్లాకు చెందిన జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ 95 లక్షలు అప్పు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. జానకి రామయ్య మరణించగా ఆయన తండ్రి వెంకటేశ్వర్లుకు గణేష్ 95 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గణేష్ కు తాజాగా ఒంగోలు కోర్టు శిక్ష, జరిమానా విధించింది.
కాగా, గతంలో బండ్ల గణేష్ పై టాలీవుడ్ రచయిత వక్కంతం వంశీ చెక్ బౌన్స్ కేసు వేశారు. ఈ క్రమంలోనే బండ్ల గణేశ్‌కు 2017లో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 15.86 లక్షల జరిమానా విధించింది. టెంపర్ సినిమా కథకు సంబంధించిన పారితోషికం విషయంలో గణేష్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని వంశీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసులో ఆయన బెయిల్ పై ఉన్నారు. ఈ రెండు కేసులే కాకుండా మరికొన్ని చెక్ బౌన్స్ కేసులలో కూడా బండ్ల గణేష్ పై కేసులు ఉన్నట్లు.. వాటిపై ఆయన అప్పీల్ కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates