ఇప్పుడు దర్శకులుగా వెలుగొందుతున్న చాలామంది.. మెగా ఫోన్ పట్టడానికి ముందు అనేక కష్టాలు పడ్డవాళ్లే. అసిస్టెంట్ డైరెక్టర్లుగా, రైటర్లుగా ఎన్నో ఇబ్బందులు పడి, వాటిని దాటితేనే దర్శకులుగా అవకాశం వస్తుంది. తాను కూడా అందుకు మినహాయింపు కాదని అంటున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఐతే తాను కోరి కష్టాలు తెచ్చుకున్న విషయాన్ని శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఇండియాలోనే నంబర్ వన్ అనదగ్గ ఒక దర్శకుడి దగ్గర చాలా ఏళ్ల ముందే మంచి జీతంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చినా తాను వదులుకున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. ఆ దర్శకుడి దగ్గర ఒక సిచువేషన్ తలెత్తి, అత్యవసరంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చిందని, అప్పుడు 50 వేల రూపాయల జీతం ఇస్తా, ఏడీగా వచ్చేయమని ఆ పెద్ద దర్శకుడు తనకు ఆఫర్ ఇచ్చాడని.. ఆ రోజుల్లో అంత మొత్తం జీతం అంటే పెద్ద విషయం అని.. కానీ తాను మాత్రం సుకుమార్ దగ్గరే పని చేస్తా అని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించానని శ్రీకాంత్ వెల్లడించాడు.
ఇక సుకుమార్ దగ్గర అవకాశం కోసం తాను ఎంత కష్టపడింది కూడా శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు. ముందుగా ‘ఆర్య-2’ సినిమా తర్వాత సుకుమార్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో కలిసినట్లు శ్రీకాంత్ తెలిపాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు సుకుమార్ ఇంటి దగ్గర తెల్లవారుజామునే 5 గంటలకు వెళ్లి నిలబడేవాడినని.. ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి ఒంటి గంటకు గుడ్ నైట్ చెప్పేవాడని.. ఇలా మూడేళ్ల పాటు చేశానని.. మూడో సంవత్సరంలో సుకుమార్ పిలిచి ఎవరు నువ్వు, అసలేంట్రా నీ బాధ అని అడిగాడని శ్రీకాంత్ చెప్పాడు.
మీ దగ్గర ఏడీగా పని చేయాలి అని అంటే.. వెళ్లి ఒక షార్ట్ ఫిలిం తీసుకురమ్మాడని.. అప్పుడు తన ఫ్రెండును పెట్టి షార్ట్ ఫిలిం చేశానని.. అది చూశాక తాను ఇప్పుడే వేరే సినిమా చేస్తున్నానని, వేరే చోట ఏడీగా చేరమని సుకుమార్ తెలిపాడని.. కానీ తాను మాత్రం చేస్తే మీ దగ్గరే పనిచేస్తా అని తేల్చి చెప్పినట్లు శ్రీకాంత్ వెల్లడించాడు.
అలా అప్పటికే షూటింగ్ నడుస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఏడీగా పని చేయడం మొదలుపెట్టానని.. తర్వాత ‘రంగస్థలం’ మూవీకి పూర్తి స్థాయిలో మొదట్నుంచి చివరి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశానని శ్రీకాంత్ తెలిపాడు. సుకుమార్ దగ్గర రెండు సినిమాలకే పని చేస్తానని ముందే చెప్పానని.. తర్వాత కూడా కంటిన్యూ అవ్వమని అడిగినా సరే, తాను లేదని చెప్పి బయటికి వచ్చేశానని.. కథ రాసుకుని నిర్మాత సుధాకర్ చెరుకూరిని కలిస్తే.. ఆయన ద్వారా నాని పరిచయం అయి ‘దసరా’ సినిమా పట్టాలెక్కిందని శ్రీకాంత్ ఓదెల వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates