మంగళవారం కాదు మంగాపురం గెలవాలి

వచ్చే నెల 9 జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలవుతోంది. మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వచ్చే వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. స్వంత అన్నయ్య రమేష్ బాబు కొడుకు లాంచ్ కావడంతో మహేష్ ఏం మాట్లాడతాడోననే దాని మీద అభిమానులతో పాటు యూనిట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అశ్వినిదత్ లాంటి అగ్ర నిర్మాతలు ఈ ప్రాజెక్టు వెనుక ఉండటంతో రిలీజ్ పరంగా పెద్ద మద్దతు దక్కనుంది. బిజినెస్ ఇప్పటికే మొదలుపెట్టారు.

దర్శకుడు అజయ్ భూపతి గత సినిమా ‘మంగళవారం’ విమర్శకుల ప్రశంసలతో పాటు డీసెంట్ సక్సెస్ అందుకుంది. మరీ రికార్డులు బద్దలు కొట్టలేదు కానీ కమర్షియల్ గా పే చేసింది. దీని కన్నా ముందు ఆయన చేసిన ‘మహా సముద్రం’ గాయాన్ని కొంతమేర మానిపోయేలా చేసింది. ప్రయోగాల వైపు ఎక్కువ మొగ్గు చూపే అజయ్ భూపతి ఈసారి మాస్ రూటు పట్టారు. ఎంత ప్రేమకథ అయినప్పటికీ శ్రీనివాస మంగాపురంలో కమర్షియల్ ఫ్లేవర్ కనిపిస్తోంది.

ఇది కనక హిట్ అయితే అజయ్ భూపతి ఏకంగా మహేష్ బుక్స్ లో పాజిటివ్ గా ఉండిపోతారు. అలాని సినిమా ఇస్తారని కాదు. ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చాక ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి. రామ్ చరణ్ ని పూరి జగన్నాథ్, మహేష్ బాబు – అల్లు అర్జున్ ని రాఘవేంద్రరావు విజయవంతంగా లాంచ్ చేశారు. ఇప్పుడు అజయ్ కూడా వాళ్ళలాగే జయకృష్ణకు హిట్ ఇస్తే రేంజ్ పెరుగుతుంది. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదాని ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమవుతోంది.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ప్రధాన పాత్ర పోషించడం మరో ప్రత్యేక విషయం. కన్నప్ప తప్ప గత కొన్నేళ్లుగా బయట సినిమాలు చేయని ఈ విలక్షణ నటుడిని ఇద్దరు మాత్రమే తమ కథలతో ఒప్పించారు. శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ మొదటిది కాగా అజయ్ భూపతి శ్రీనివాసమంగాపురం రెండోది. గతంలో రమేష్ బాబుతో స్క్రీన్ పంచుకున్న మోహన్ బాబు ఇప్పుడు జయకృష్ణతోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మంగళవారం కన్నా ఎక్కువగా మంగాపురంతో మెప్పించే బాధ్యత అజయ్ భూపతి మీద ఉంది.