నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ లేదా పిఆర్ నుంచి కానీ రావడం సహజం. కానీ కింగ్ 100 విషయంలో అలాంటివి లేకుండా చూసుకున్నారు. లెనిన్ విడుదలయ్యే దాకా తన మూవీ గురించి ఎలాంటి వార్తలు రాకుండా నాగ్ తీసుకున్న జాగ్రత్తే దీనికి కారణం. ఇటీవలే కొడుకు మూవీ సూపర్ హిట్ అయిపోయి ఓటిటి స్ట్రీమింగ్ కూడా వచ్చేస్తోంది కాబట్టి ప్రధాన బాధ్యత తీరిపోయింది.

ఇప్పుడు అక్కినేని అభిమానుల చూపు తమ హీరో మైలురాయి ఎప్పుడు వస్తుందనే దాని మీద ఉంది. ఆగస్ట్ 29 నాగార్జున పుట్టినరోజు. ఖచ్చితంగా ఏదో ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. దర్శకుడు కార్తీక్ ప్రస్తుతం టీజర్ సిద్ధం చేసే సాధ్యాసాధ్యాల గురించి టీమ్ తో చర్చిస్తున్నారట. ఒకవేళ కుదరకపోతే పోస్టర్ తో పాటు విడుదల తేదీ అనౌన్స్ చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే. లాటరీ కింగ్, కింగ్ 100 అనే రెండు టైటిల్స్ లో ఒకదాన్ని ఫిక్స్ చేయబోతున్నారు.

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న టైంలో నాగార్జునకు ఈ రెండు చాలా కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కింగ్ 100 రూపంలో ఒక ముఖ్యమైన అసంతృప్తిని అభిమానుల్లో తొలగించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కుబేర, కూలిలో నాగార్జున చేసిన క్యారెక్టర్లు ఆ సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడ్డాయో కానీ ఫ్యాన్స్ మాత్రం వాటిని చేసి ఉండకూడదని ఇప్పటికీ ఫీలవుతున్నారు. ఇప్పుడీ వందో మూవీ కనక హిట్టు కొడితే సోలో హీరోగా మళ్ళీ కంబ్యాక్ అయినట్టే.

ఇంత పెద్ద మైలురాయిని గ్రోయింగ్ స్టేజి లో ఉన్న డైరెక్టర్ కు ఇచ్చి నాగార్జున చాలా రిస్క్ తీసుకున్నారని అంటున్న వాళ్ళు లేకపోలేదు. అయితే శివ నుంచే ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేయడం అలవాటుగా మార్చుకున్న నాగ్ వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న కింగ్ 100లో చాలా గ్యాప్ తర్వాత టబు తనకు ఇష్టమైన నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే సంక్రాంతికి రావడం పక్కా అని టాక్.