ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి పెట్టి ఉంటుందని చెప్పిన సామెత సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది. దర్శకులు ప్రత్యేకంగా కొందరు హీరో హీరోయిన్ల కోసమే కొన్ని కథలు రాసుకుంటారు. కానీ ఆ కాంబోలు సాధ్యం కాక వేరొకరు చేయడం చాలా సార్లు జరిగింది. అతడు నెరేషన్ టైంలో పవన్ కళ్యాణ్ కు నిద్ర రాకపోయి ఉంటే కిల్లర్ పార్ధుగా మహేష్ బాబుకి కల్ట్ పాత్ర మిస్సయ్యేది. వేరొకరి కోసం రాసుకున్న బ్రహ్మోత్సవంకి నో చెప్పి ఉంటే డిజాస్టర్ తప్పేది. ఇలా ఉంటాయి టాలీవుడ్ కథలు.
రేపు విడుదల కాబోతున్న KJQ మీద మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో నాగార్జున కేడిని తెరకెక్కించిన దర్శకుడు కిరణ్ కుమార్ అలియాస్ కెకె చాలా కాలంగా KJQ మీద వర్క్ చేశారు. షూటింగ్ పూర్తి కాకముందే దురదృష్టవశాత్తు కన్ను మూయడం టీమ్ లో విషాదాన్ని నింపింది. అయినా సరే నిబ్బరం కోల్పోకుండా ఆయన విజన్ కు అనుగుణంగా మిగిలింది ఫినిష్ చేశారు. ప్రమోషన్లలో భాగంగా ఒకప్పటి కేకే రూమ్ మేట్, స్నేహితుడు సందీప్ రెడ్డి వంగా కెమెరా ముందుకొచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ KJQకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ బైట్ పంచుకున్నారు. ఈ సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్ కోసం ముందు అనుష్కని అనుకుని దానికి అనుగుణంగానే కథ రాసుకున్నారట. అయితే అది సాధ్యం కాలేదు. కాలక్రమేణా పన్నెండు సంవత్సరాల పాటు కేకె ఈ స్క్రిప్ట్ కోసం కష్టపడుతూ వచ్చారు. లీడ్ యాక్టర్స్ గా దీక్షిత్ శెట్టి, శశి ఓదెలని తీసుకున్నాక అనుష్క కోసం రాసుకున్న క్యారెక్టర్ కి యుక్తి తరేజాని ఎంచుకుని తన లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఒకవేళ నిజంగా అనుష్క చేసి ఉంటే KJQ స్థాయి మరింత పెరిగేది కానీ కంటెంట్ లో ఉన్న డెప్త్ ఖచ్చితంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తుందనే నమ్మకం చిత్ర బృందంలో ఉంది. సందీప్ వంగా సైతం ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన ఈ ఇంటెన్స్ డ్రామా ఇప్పుడు ఎలా వచ్చిందో చూడాలనే ఎగ్జైట్ మెంట్ తనకూ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కళ్ళెదురుగా దర్శకుడు కేకే సజీవంగా లేనప్పటికీ KJQ విజయం ద్వారా ఆయనకు సరైన నివాళి అర్పించాలని టీమ్ కోరుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates