రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ అవుతోంది. డేట్ కొద్దిరోజుల క్రితమే లీకైనప్పటికీ ఇవాళ అధికార ముద్ర పడింది. 112 సెకండ్ల టీజర్ లో జడల్ జమానా ఎలా ఉండబోతోందో సాంపిల్ చూపించారు. ముందు నుంచి నెలకొన్న అంచనాలకు తగ్గట్టే అవుట్ అండ్ అవుట్ వయొలెన్స్ తో నిండిపోయిన ప్యారడైజ్ విజువల్స్ రక్తంలో మునిగి తేలాయి. కథని వీలైనంత రివీల్ కాకుండా కట్ చేశారు.

ఎప్పుడో దశాబ్దాల వెనుకటి కాలం. హైదరాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలో అరాచకం రాజ్యమేలుతూ ఉంటుంది. దానికి బాధ్యుడు శికంజి మాలిక్ (మోహన్ బాబు). అణిచివేతకు విసిగి వేసారిన జాతి కోసం జడల్ (నాని) తొడగొడతాడు. బ్లేడుతోనే వందలాది పీకలు కోసే సత్తా ఉన్న ఇతని వెంట వేలాది మంది నడుస్తారు. గల్లీ నుంచి జైలు దాకా జడల్ వెళ్లని చోటు, చేయని విధ్వంసం ఉండదు. అసలు ఈ రక్తపాతానికి కారణం ఎవరు, వర్గాల మధ్య వైరం ఎక్కడిదాకా వెళ్లిందనేది అసలు స్టోరీ.

టీజర్ చాలా వేగంగా పరుగులు పెట్టింది. కొన్ని షాట్స్ అర్థం చేసుకునేలోపే మాయమైపోవడం చూస్తుంటే శ్రీకాంత్ ఓదెల కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ దొరక్కుండా ఎంత జాగ్రత్త పడ్డారో అర్థమవుతుంది. ప్యారడైజ్ కోసం సృష్టించిన ప్రపంచంలో చాలా చీకటి, నెత్తురు ఉన్నాయి. ఎంటర్ టైన్మెంట్ లేకుండా కేవలం ఇంటెన్స్ డ్రామాని తెరకెక్కించిన వైనం స్పష్టంగా చూపించారు. హీరోయిన్ కయదు లోహర్, సంపూర్ణేష్, మోహన్ బాబును జస్ట్ అలా చూపించి వదిలేశారు.

అభిమానులు ఊహించిన స్థాయిలో ఇంటెన్సిటీ అయితే ఉంది. ఇంకా ట్రైలర్ రావాలి కాబట్టి మరింత మెరుగైన విజువల్స్ ని తర్వాత ఆశించవచ్చు. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే బాగా ఎలివేట్ కాగా టెక్నికల్ గా ప్యారడైజ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి టీజర్ ఉపయోగపడింది. రిలీజ్ డేట్ లో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవు. ఇప్పటికే పలు వాయిదాలు పడటంతో ఇకపై ఎలాంటి పోస్ట్ పోన్ లేకుండా అన్నీ పక్కా ప్రణాళికతో జరిగిపోతున్నాయి.