ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్ బిజీగా ఉంది. స్క్రిప్ట్ లాకైపోయింది కానీ ఫైనల్ నెరేషన్ ఇంకొక్కసారి అయిపోయాక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. పెద్దికి ఒళ్ళు హూనం చేసుకున్నా ఆశించినంత పెద్ద ఫలితం రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అందుకే రంగస్థలంని మించిపోయేలా ఇంకా చెప్పాలంటే పుష్పని దాటే స్థాయిలో కంటెంట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈసారి దర్శకుడు సుకుమార్ కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉండరనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. మొట్టమొదటిసారి వీళ్ళ బంధానికి బ్రేక్ పడనుంది. ఇప్పుడు దేవి ప్లేస్ లో దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ వస్తారా లేక సౌత్ సెన్సేషన్ సాయి అభ్యంక్కర్ ని లైన్ లో పెడతారానేది ఇంకా తేలలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నారని, కాకపోతే టైం చూసి చెబుతారని సమాచారం.
హీరోయిన్ కోసం రెండు మూడు ఆప్షన్లు పరిశీలనలో పెట్టారట. తాజాగా రుక్మిణి వసంత్ పేరు తెరపైకి వచ్చింది. టాక్సిక్, డ్రాగన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ లో ఛాన్స్ దక్కించుకున్న ఈ కన్నడ భామకు చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ దృష్ట్యా ఆర్సి 17కి ఎక్కువ డేట్లు ఇవ్వలేకపోతే ఎంపిక కష్టమవుతుందట. పుష్ప టైంలో రష్మిక మందన్నతో ఈ విషయంలోనే కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో సుకుమార్ ఈసారి అలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడతారట.
షూట్ ఎప్పుడు మొదలైనా విడుదల మాత్రం 2028లో ఉంటుంది. నిర్మాణానికి ఏడాది టైం తీసుకున్నా అటుపై పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు కలిపి ఇంకో సంవత్సరంన్నర దాకా వేచి చూడాల్సి ఉంటుంది. సుకుమార్ ఎలాంటి జానర్ రాసుకున్నారనేది కూడా బయటికి రాలేదు. విలేజ్, స్మగ్లింగ్ కాకుండా ఈసారి నగర వాతావరణంలో యానిమల్ తరహా వయొలెంట్ డ్రామా సిద్ధం చేసుకున్నారనే లీక్ వినిపిస్తోంది. ఇదెంత వరకు నిజమో కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates