వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు ఓపెనింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో ప్రమోషన్లు కూడా ఆపేశారు. రొటీన్ కథ, రెగ్యులర్ ట్రీట్ మెంట్, ఇరవై సంవత్సరాల వెనకే ఉన్నట్టు దర్శకుడు తీసిన విధానం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. కొన్ని ఎపిసోడ్స్ బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ ఓవరాల్ గా సినిమాని నిలబెట్టడానికి అవి సరిపోలేదు. ఫలితంగా ఎదురీదాల్సి వస్తోంది.

దీని కమర్షియల్ ఫలితం ఎలా ఉందనేది పక్కన పెడితే వడ్డే నవీన్ నిజంగా కష్టపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు మేకప్ కు దూరంగా ఉండి డాన్సులు, ఫైట్ల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాడు. అయితే ఇది వసూళ్లుగా మారలేకపోయింది. సరే దీని సంగతలా ఉంచితే నవీన్ నెక్స్ట్ ఏం చేస్తాడనే దాని మీద అభిమానులు ఎదురు చూస్తున్నారు. హీరోగా చేయాలంటే ఎవరో నిర్మాత దొరక్కపోవచ్చు. కానీ తన ఇమేజ్ గురించి గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి కదా.

ప్రస్తుతం ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్టుల కొరత చాలానే ఉంది. శ్రీకాంత్, జగపతిబాబు, జెడి చక్రవర్తి తరహాలో మెల్లగా రూటు మార్చి వైవిధ్యమైన పాత్రలు చేయడం మంచి ఛాయస్. ఎలాగూ అందగాడే కాబట్టి నవీన్ కోసం డిజైన్ చేసే పాత్రలు దానికి తగ్గట్టే ఉంటాయి. మరీ నాన్న మావయ్య లాంటివి కాకుండా హీరోలకు అన్నయ్యగా డీసెంట్ క్యారెక్టర్స్ పట్టొచ్చు. శ్రీహరి ఒక స్టేజిలో ఇలా దారి మార్చుకుని మంచి సెకండ్ ఇన్నింగ్స్ నిర్మించుకున్నారు.

ఇప్పటికైతే నవీన్ వడ్డే అలాంటి ఆలోచన చేసినట్టు కనిపించడం లేదు. కంటెంట్ సంగతి ఏమో కానీ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుకు మెయిన్ దెబ్బ మా ఇంటి బంగారం రూపంలో పడింది. జనాలంతా దానికి షిఫ్ట్ అయిపోవడంతో వేరే సినిమాలను పట్టించుకోలేదు. బాగానే ఉందని రిపోర్ట్స్ వచ్చిన దీవానా సైతం పోరాడాల్సి వస్తోంది. ఒకవేళ ఇదే ట్రాన్స్ ఫర్ ఏదైనా సోలో టైంలో రిలీజ్ చేసి ఉంటే నవీన్ వడ్డే ఎక్కువ శాతం రీచ్ అయ్యేవాడేమో. ఏదైతేనేం ఛాన్స్ అయితే మిస్సయ్యింది.