అల్లు సినిమాస్‌పై కంప్లైంట్.. వీడియో తీసుకున్న అరవింద్

ఈ ఏడాది ఆరంభంలో మొదలైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ ప్రియుల ఫేవరెట్ స్పాట్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా ఇందులోని డాల్బీ స్క్రీన్‌కు ఉన్న ఆకర్షణే వేరు. భారీ తెర, ఆడిటోరియం, అదిరిపోయే టెక్నాలజీతో సినీ ప్రియులను ఈ స్క్రీన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆసియాలోనే అతి పెద్ద డాల్బీ థియేటర్ కావడంతో చుట్టుపక్కల వాళ్లే కాదు.. చాలా దూరం నుంచి కూడా సినీ ప్రేమికులు ఈ థియేటర్‌కు సినిమా చూసేందుకు వస్తుంటారు.

కానీ వారికి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తోంది అల్లు సినిమాస్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏ క్రేజున్న సినిమా రిలీజైనా సరే.. పై వరుసలకు సంబంధించిన టికెట్లన్నీ బ్లాక్ చేసి పెట్టేస్తుండడం సినీ ప్రియులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఈ థియేటర్లో పై వరుసల నుంచి సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరుగా ఉంటుంది. భారీ తెరను బెస్ట్ వ్యూ సీట్స్ నుంచి చూడాలని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈ స్క్రీన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రతి షోకూ పై వరుసలను బ్లాక్ చేసి, తమకు కావాల్సిన వాళ్లకే టికెట్లు ఇచ్చుకుంటుండడం.. ఏవైనా టికెట్లు మిగిలితే షో మొదలవడానికి కొన్ని నిమిషాల ముందు రిలీజ్ చేస్తుండడం మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి.

ఐతే సోషల్ మీడియాలో సినీ ఫైల్స్ ఎంత మొత్తుకుంటున్నా అల్లు సినిమాస్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఒళ్లుమండిన కొందరు నేరుగా అల్లు సినిమాస్ యజమాని అల్లు అరవింద్‌కే కంప్లైంట్ చేశారు. నిన్న తన ప్రొడక్షన్ సినిమా ‘ఆకాశంలో ఒక తార’ స్పెషల్ ప్రిమియర్ కోసం డాల్బీ థియేటర్‌కు వచ్చిన అరవింద్‌ను కొందరు కుర్రాళ్లు ఆపి మేనేజ్మెంట్ ఆగడాల గురించి ఫిర్యాదు చేశారు.

వాళ్ల బాధను స్వయంగా వీడియో రికార్డ్ చేసుకున్న అరవింద్.. ఈ విషయాన్ని తాను టేకప్ చేస్తానని, ఇక నుంచి పై రెండు వరుసలు మినహాయిస్తే అన్నీ పబ్లిక్‌కు అందుబాటులో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. అరవింద్ మాట తీరు చూస్తే ఈ విషయాన్ని ఆయన చాలా సీరియస్‌గానే తీసుకున్నట్లే కనిపిస్తోంది. మరి ఆయన మార్పు చూపిస్తారేమో చూడాలి.