కొత్త శుక్రవారం వచ్చేసింది. పెద్దికి ఇవాళ తొమ్మిదో రోజు. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం రెండో వారం దాటగానే మూడు వందల యాభై కోట్లకు దగ్గరగా వెళ్లడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ, మిక్స్డ్ టాక్ ప్రభావం కొంత ఆక్యుపెన్సీల మీద పడుతున్న మాట వాస్తవం. ఎడిటింగ్ లోపాలు, కత్తిరించిన సన్నివేశాల మీద టీమ్ వర్క్ చేస్తూ కొత్త వెర్షన్ ని సిద్ధం చేస్తోందనే వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ దాని కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు.
పెంచిన టికెట్ రేట్లతో ఇప్పటిదాకా పవర్ ప్లే బ్యాటింగ్ చేసిన పెద్ది అసలు ఆట ఇప్పటి నుంచి ఆడాల్సి ఉంటుంది. చాలా చోట్ల సాధారణ రేట్లు అమలులోకి వచ్చాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం పది రోజుల దాకా జిఓ ఉంది కాబట్టి అవకాశాన్ని ఎందుకు వదలాలన్న ఉద్దేశంతో శనివారం దాకా పెంచిన ధరలే పెట్టారు. ఇది డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయమని, తాము చేయగలిగింది ఏమి లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. పెద్ద నెంబర్లు వేగంగా రావడానికి కారణం ఒక రకంగా ఈ పెంపులే.
అసలైన సవాళ్లు ఇప్పుడు రాబోతున్నాయి. ఇంకొక్క వారం పది రోజులు కనక పెద్ది బలంగా నిలబడితే పూర్తిగా బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు. హిందీ, తమిళ, మలయాళంలో మేజిక్ చేయకపోయినా ఏపీ తెలంగాణ వరకు లాభాల్లోకి అడుగు పెట్టొచ్చు. ఉత్తరాంధ్ర లాంటి కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ అది జరిగిపోయింది కూడా. మిగిలిన చోట్ల కూడా సేఫ్ అవ్వాలంటే పెద్ది మూమెంట్ ని కొనసాగించాలి. జనం ఇంకొన్ని రోజులు మాట్లాడుకునేలా పబ్లిసిటీ గేరు మార్చాలి.
ఒకపక్క స్కూళ్ళు కాలేజీలు తెరిచేస్తున్నారు. పిల్లలు, కుటుంబాలు డైవర్ట్ కావడం మొదలవుతుంది. ఈ వర్గాన్ని ఒడిసిపట్టుకోవడానికి ఈ వీకెండ్ ఒక్కటే మంచి అవకాశం. ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 13 నుంచే పెద్ది మాములు రేట్లకు వచ్చేస్తుంది. సో సండే వసూళ్లు చాలా కీలకం కాబోతున్నాయి. నాలుగు వందల కోట్ల మార్కు అందుకోవడం అసాధ్యం కాదు కానీ వేగం పెంచాల్సి ఉంటుంది. ఓవర్సీస్ లో మాత్రం 5 నుంచి 6 మిలియన్ల దగ్గర నిలబడే సూచనలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
