ఐమాక్స్.. ఈ పేరు చెబితే సినీ ప్రేమికుల మనసు ఉప్పొంగుతుంది. ఆ ఫార్మాట్ థియేటర్లలో సినిమా చూసిన వారు ఆ అనుభూతి గురించి గొప్పగా మాట్లాడతారు. భారీ తెర, విస్తృతమైన దృశ్యం, అద్భుతమైన క్లారిటీ, అదిరిపోయే సౌండింగ్‌తో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో ఐమాక్స్ స్క్రీన్ల ప్రత్యేకతే వేరు. ఐతే మన దేశంలో ఐమాక్స్ స్క్రీన్లు ఉండాల్సిన సంఖ్యలో లేకపోవడం నిరాశ కలిగించే విషయమే.
ముఖ్యంగా దేశంలోనే సినీ అభిమానం అత్యధిక స్థాయిలో ఉండే హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం నిరాశ కలిగించే విషయం. త్వరలో ఆ కల నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఐమాక్స్‌ను దాని యాజమాన్య సంస్థ అమ్మేయడానికి రెడీ అయిందన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని బడా ఎంటర్మైన్మెంట్ సంస్థలతో ఐమాక్స్ ఆర్గనైజేషన్ ఈ మేరకు సంప్రదింపులు మొదలుపెట్టిందట.
60 ఏళ్ల కిందట మొదలై, అంచెలంచెలుగా విస్తరించి 1.85 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.77 లక్షల కోట్లు) విలువైన సంస్థగా ఎదిగింది ఐమాక్స్. దీన్ని బట్టి ఐమాక్స్‌ను అమ్మితే వరల్డ్ వైడ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అది ఎంత పెద్ద డీల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐమాక్స్ అమ్మకం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించగా.. ఆ వెంటనే ఐమాక్స్ షేర్ల ధర 17 శాతం మేర పెరగడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి ఇటీవల ఇబ్బందికరంగా మారినప్పటికీ.. ప్రీమియం స్క్రీన్లకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లలో ఏ సినిమా ప్రదర్శిస్తారు అన్నదాంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వస్తారు. ఈ స్క్రీన్లలో టికెట్ల ధరలు భారీగా ఉన్నా పట్టించుకోరు. అవి ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ కోసం ఎంతైనా డబ్బులు పెట్టడానికి రెడీగా ఉంటారు. ఐమాక్స్ స్క్రీన్లను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మొత్తంగా ఈ సంస్థను అమ్మేయాలనుకోవడం వెనుక కారణమేంటో మరి?
Gulte Telugu Telugu Political and Movie News Updates