పెద్దికి తొలగిన అడ్డంకులు

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్లలో అద్దె విధానం నడుస్తుండగా.. మల్టీప్లెక్సుల్లో మాదిరే తమకూ పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ఇందుకు నిర్మాతలు ససేమిరా అంటున్నారు.

ఐతే పర్సంటేజీ ఇస్తేనే ఇకపై సింగిల్ స్క్రీన్లలో కొత్త సినిమాలను ఆడనిస్తామంటూ ఎగ్జిబిటర్లు విధించిన అల్టిమేటం మీద నిర్మాతలు ఘాటుగా స్పందించగా.. రాబోయే పెద్ది సినిమా సహా వేటినీ తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో ఆడనివ్వబోమంటూ ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు.
లేక లేక తెలుగులో ‘పెద్ది’ లాంటి క్రేజీ సినిమా రిలీజ్ కాబోతుండగా.. ఇదేం పంచాయితీ అనే ప్రశ్నలు తలెత్తాయి.

అసలు ఆ సినిమాను టార్గెట్ చేయడానికే ఇప్పుడీ పంచాయితీని తీసుకొచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఐతే కారణం ఏదైనప్పటికీ.. ‘పెద్ది’ సినిమాకు ఈ గొడవ వల్ల నష్టం తప్పదేమో అనిపించింది.
కానీ ‘పెద్ది’కి ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది. పర్సంటేజీకి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు కలిసి ఒక అంగీకారానికి వచ్చారు.

డిస్ట్రిబ్యూటర్లను కూడా కలుపుకుని మూడు విభాగాలతో కలిసి ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా ఫిలిం ఛాంబర్లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. మీటింగ్ అయ్యాక మీడియాకు వివరాలు చెప్పారు.

సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతోందని.. పర్సంటేజీ విధానానికి నిర్మాతలు కూడా సానుకూలంగానే ఉన్నారని.. దీని మీద మూడు విభాగాల నుంచి కమిటీని ఏర్పాటు చేసుకుని పరిష్కారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.

అంతే కాక ‘పెద్ది’ సినిమాకు ఏ ఇబ్బందీ లేదని.. అది ఆరోగ్యకర వాతావరణంలో రిలీజవుతుందని రాజు స్పష్టం చేశారు. ఆయన మాటల్ని బట్టి చూస్తే.. ఇప్పుడున్న విధానంలోనే ఆ సినిమా రిలీజ్ కానున్నట్లే. ప్రస్తుతం ఏర్పాటైన కమిటీ నిర్ణయం మేరకు తర్వాతి రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా పర్సంటేజీ విధానాన్ని అమలు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.