మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా ఒకే మూసలో వెళ్లడాన్ని అంతగా గమనించం. అందుకే ఓటిటిలో ఎన్ని ప్రశంసలు తెచ్చుకున్నా వాటిని డబ్ చేసి ఇక్కడి థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం మనోళ్లు చేయరు. ఒకవేళ ధైర్యం చేసి రిస్క్ తీసుకున్నా కుంచక్ బోబన్ హీరోగా వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ లాగా కాసిన్ని ప్రశంసలు తప్ప బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రావు గాక రావు.
ఇప్పుడీ టాపిక్ కి కారణం ‘ఉయిర్’ అనే కొత్త మూవీ. ఇటీవలే నేరుగా ఓటిటిలో రిలీజయ్యింది. కథ సింపుల్. ఒక పాడుబడిన బావిలో స్త్రీ శవం దొరుకుతుంది. అది ఎవరిదని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన ప్రొబెషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కి లోతుగా వెళ్లే కొద్దీ షాకింగ్ నిజాలు తెలుస్తాయి. హత్య తర్వాత ఆమె పిల్లలు ముంబైలో ఉన్నారని తెలుసుకుని, వెతికి తీసుకొచ్చి డిపార్ట్ మెంట్ తో శభాష్ అనిపించుకుంటాడు. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు, సంఘటనల సమూహారమే తాజాగా వచ్చిన ఉయిర్.
రోషన్ మాతివ్ హీరోగా నటించగా నటీనటులంతా కేరళ బ్యాచే కనిపిస్తారు. కథ కథనం పరంగా ఎలాంటి కొత్తదనం ఉండదు. ఓ రెండు మూడు మలుపులు తప్ప రెండుంపావు గంటల మూవీలో సాగదీసిన సీన్లే ఎక్కువగా ఉంటాయి. అయినా ఇన్నేసి పోలీస్ క్రైమ్ సినిమాలు ఒక్క మల్లువుడ్ లోనే తీస్తున్నారనిపిస్తుంది. తలవన్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఇరట్ట, క్రిస్టోఫర్, పొప్పన్, సెల్యూట్, కుట్టవుమ్ శిక్షయుమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది.
కొన్నేళ్ల క్రితం నాయట్టు అనే హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాతలు పోటీ పడ్డారు. ఓ సంవత్సరం తర్జన భర్జనల తర్వాత శ్రీకాంత్ ప్రధాన పాత్రలో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ గా తీస్తే మనోళ్లు లైట్ తీసుకున్నారు. అయినా అక్షరాస్యత ఎక్కువగా ఉండే కేరళలో క్రైమ్ రేట్ కూడా ఎక్కువే కాబోలు. అందుకే ఖాకీ విచారణల మీద ఇన్నేసి చిత్రాలు వస్తున్నా చూస్తూనే ఉన్నారు. మనకు ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అలా బుల్లితెర మీద లాగించేయవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates