దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో అంటూ ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం లేదు కదా మొత్తానికే సైలెంట్ అయిపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. లైగర్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని చిక్కుల వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఆయన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకోవాలనే ప్రణాళికలో ఉన్నట్టు కొద్ది వారాల క్రితం ప్రచారం జరిగింది. పోకిరి రీ రిలీజ్ అందుకే ఆగినట్టుగా చెప్పుకున్నారు.
ఇదంతా పక్కనేడితే స్లమ్ డాగ్ సరైన సమయంలో మేలుకోవడం లేదనేది వాస్తవం. సమ్మర్ లో ప్లాన్ చేసుకున్న పెద్ది, ప్యారడైజ్, స్వయంభు లాంటి ప్యాన్ ఇండియా మూవీసన్నీ వాయిదా పడ్డాయి. దూరం వెళ్లిపోయాయి. చిన్న సినిమాలతో బాక్సాఫిస్ ఎదురీదుతోంది. డెకాయిట్, కపుల్ ఫ్రెండ్లీ, బైకర్, రాకాస లాంటివి ఓకే అనిపించుకున్నా కమర్షియల్ గా గొప్ప అద్భుతాలు చేయలేకపోయాయి. బడ్జెట్ తక్కువ మూవీస్ ఏమో జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి.
అటు తమిళనాడులో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఇప్పుడు కనక స్లమ్ డాగ్ వచ్చి ఉంటే వసూళ్ల పరంగా చాలా ప్లస్ అయ్యేది. ఎలాగూ విజయ్ సేతుపతికి రెండు భాషల్లో ఇమేజ్ ఉంది కాబట్టి బిజినెస్ తో పాటు ఇతరత్రా వ్యవహారాలు జరిగిపోయేవి. కాకపోతే ఓటిటి డీల్స్ ఇంకా అవ్వలేదని ఇన్ సైడ్ టాక్. డబుల్ ఇస్మార్ట్, లైగర్ ట్రాక్ రికార్డు కొంచెం నెగటివ్ గా పని చేసినట్టు ఉంది. అయినా సరే సరైన ప్రమోషన్లు చేసుకుంటే ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన స్లమ్ డాగ్ లో దునియా విజయ్ విలన్ గా నటించగా టబు మరో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది హిట్ కొట్టడం ద్వారా తిరిగి రేస్ లోకి రావాలని చూస్తున్న పూరి ముందైతే పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాలి. ఏప్రిల్ 20 పూరి తొలి సినిమా బద్రి రిలీజై ఇరవై ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఆ సందర్భంగా అయినా పూరి నుంచి స్లమ్ డాగ్ గురించి గుడ్ న్యూస్ వస్తుందేమో చూడాలి. అభిమానులు తన కంబ్యాక్ కోసం బలంగా ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
