పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏమీ చెక్కుచెదరలేదు. ఆయన సినిమా చేస్తానంటే బ్లాంక్ చెక్కు పట్టుకుని నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉంటారు.

ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు తక్కువ కాకుండా పారితోషకం తీసుకునే స్థాయిలో ఉన్నారు. అలాంటిది తన కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన ‘తొలి ప్రేమ’ చిత్రానికి పవన్ తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా? కేవలం రూ.12-13 లక్షలేనట. ఒక దశలో ఆ పారితోషకాన్ని కూడా పవన్ వదులుకోవడానికి సిద్ధమయ్యాడట. ఈ సంగతి పవన్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘తొలిప్రేమ’ చిత్రం కోసం సముద్రం దగ్గర వేసిన తాజ్ మహల్ సెట్ ఎంత ఆకర్షణగా నిలిచిందో తెలిసిందే. ఐతే ఈ సెట్ విషయంలో నిర్మాతలు ముందు పెద్దగా ఆసక్తితో లేరట. అప్పటికి ఆనంద్ సాయి కొత్త వాడు. అతణ్ని నమ్మి సముద్ర తీరంలో రూ.15 లక్షలు పెట్టి సెట్ వేయడం అవసరమా అన్నది నిర్మాతల అభ్యంతరమట.

ఇదే విషయాన్ని దర్శకుడు, హీరో దగ్గర కూడా చెప్పారట. కానీ పవన్ మాత్రం ఆనంద్‌ను నమ్మి ఆ సెట్ ఉండాల్సిందే అని పట్టుబట్టాడట. ఒకవేళ ఆ సెట్ వల్ల నష్టం వాటిల్లితే.. తన పారితోషకం నుంచి కట్ చేసుకోమని పవన్ చెప్పాడట.
పవన్ అలా చెప్పేసరికి తన మీద ఇంకా భారం పెరిగిపోయిందని.. బాగా టెన్షన్ పడ్డానని ఆనంద్ వెల్లడించాడు.

ఆ టెన్షన్‌కు ప్రధాన కారణం.. సెట్ వేసిన తర్వాత అక్కడ చిత్రీకరణ జరపడానికి రెండు రోజుల ముందు అలలు దానికి దగ్గరగా వచ్చేయడమేనట. దీంతో ఎక్కడ సెట్ అంతా కూలిపోతుందో అని చాలా భయపడ్డానని.. అప్పుడు కూడా పవనే తనకు ధైర్యం చెప్పాడని.. సముద్రం దగ్గర కూర్చుని అంతా మంచే జరగాలని ప్రార్థించమని చెప్పాడని.. తాను ఆ రెండు రోజులు అదే పని చేశానని.. ఏ ఇబ్బందీ లేకుండా అక్కడ షూట్ పూర్తయిందని.. ఆశ్చర్యకరంగా తాము చిత్రీకరణ పూర్తి చేసిన రెండో రోజుకు అలల వల్ల ఆ సెట్ సగానికి పైగా కొట్టుకుపోయిందని వెల్లడించాడు ఆనంద్ సాయి.