నెల రోజుల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈడీ అరెస్టు చేసింది. అయితే.. ఈడీ అరెస్టు చేసిన సమయంలో దీనికి ప్రాతినిధ్యం వహించిన అధికారి ఒకరే కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈయనకు కేంద్ర హోం శాఖ తాజాగా జడ్+ భద్రతను కల్పించింది. జార్ఖండ్ సీఎంగా ఉన్న(ఇప్పుడు మాజీ) హేమంత్ సొరేన్‌ను అరెస్టు చేసింది.. ఈడీ అదనపు డైరెక్టర్ కపిల్ రాజ్. ఇక, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది కూడా కపిల్ రాజే కావడంతో ఆయన వ్యవహారంపై రాజకీయ నేతలు దృష్టి పెట్టారు.
కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేయగా.. హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన పీఎంఎల్ఏ కేసులో అరెస్టు చేశారు. కేజ్రీవాల్ మాదిరిగానే సోరెన్ కూడా ఈడీ సమన్లను దాటవేశారు. సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు అందాయి. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో ఎలాంటి హైటెన్షన్ వాతావరణం నెలకొందో.. హేమంత్ సోరెన్ అరెస్ట్ సమయంలోనూ ఇవే పరిస్థితులు కనిపించాయి.
కస్టడీలోకి తీసుకునే ముందు ఈడీ అధికారులు కొద్దిసేపు ప్రశ్నించారు. జనవరి 31న రాంచీలో హైడ్రామా తర్వాత అరెస్ట్ అయ్యారు. అరెస్ట్‌కు హేమంత్ సోరెన్ దాదాపు 48 గంటలపాటు కనిపించకపోవడం అప్ప ట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. తాజాగా కేసులో అరవింద్ కేజ్రీ వాల్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపించడం లేదు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు ప్రకటించారు.
ఎవరీ కపిల్ రాజ్.. ఇదీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈయన ఐఆర్ ఎస్ అధికారి. అయితే.. 2009లోనే ఆయన ఈడీకీ జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈయన కు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ గోప్యంగా ఉంచింది. ఆయన ఎక్కడివారు.. అనేది తెలియకుండా చేయడం గమనార్హం. దీనిని బట్టి ఆయన గుజరాత్, లేదా యూపీకి చెందిన అధికారిగా భావిస్తున్నారు. ఇక, ఈయనకు కూడా తాజాగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates