మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో అంత్యక్రియలు నిర్వహించడం గగనంగా మారింది. థాయ్ సంప్రదాయం ప్రకారం మృతదేహాలను దహనం చేయడానికి వాడే స్మశాన వాటికల ఫర్నేసులకు డీజిల్ తప్పనిసరి.
అయితే, పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకోవడం, ఉన్నచోట కూడా కేవలం వాహనాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆలయాల వద్ద డీజిల్ నిల్వలు నిశ్శేషమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తుందని అక్కడి బౌద్ధ సన్యాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకాక్‌కు సమీపంలోని చాచోయింగ్‌సావో ప్రావిన్స్‌లో ఉన్న వాట్ సమాన్ రతనరామ్ ఆలయ అధికారులు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో వివరించారు. గత 50 ఏళ్లలో ఇలాంటి గడ్డు కాలాన్ని ఎప్పుడూ చూడలేదని ఆలయ ప్రధాన అర్చకులు ఆవేదన చెందారు.
ఆ ఆలయంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ కేవలం మరో రెండు అంత్యక్రియలకు మాత్రమే సరిపోతుంది. థాయిలాండ్‌లో మృతదేహాన్ని దహనం చేయడం ద్వారా ఆత్మ స్వర్గానికి చేరుతుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. కానీ ఇప్పుడు ఇంధనం దొరకక ఆఖరి ప్రయాణం కూడా అడ్డంకులతో సాగుతోంది.
ఆగ్నేయాసియా దేశాలు చమురు కోసం ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షిప్పింగ్ సేవలు దెబ్బతినడంతో ఇంధన సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల థాయిలాండ్‌లోని దాదాపు 1,500 పెట్రోల్ బంకుల్లో జరిపిన సర్వేలో 10 శాతం బంకులు పూర్తిగా మూతపడ్డాయి. మరో 70 శాతం బంకుల్లో నిల్వలు అట్టడుగుకు చేరిపోయాయి. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇంధనాన్ని నిల్వ చేయకుండా ప్రభుత్వం పరిమితులు విధిస్తుండటంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రభుత్వం మాత్రం దేశంలో మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు భయాందోళనతో ముందే ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుండటంతో కొరత మరింత పెరుగుతోంది. కేవలం థాయిలాండ్‌లోనే కాకుండా, మరికొన్ని దేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంధన ధరలు సరఫరా సమస్యల వల్ల అంత్యక్రియల సేవలకు ఆటంకం కలిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates