భారత లెజెండరీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లేనా? ఈ ఏడాది ఐపీఎల్‌తో అతను ఆటకు గుడ్‌బై చెప్పబోతున్నట్లేనా? ఔననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ధోని ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించట్లేదన్న వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఈ చర్చే జరుగుతోంది.
చెన్నై యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అతను పగ్గాలు అప్పగించేశాడు. ధోని రెండేళ్ల ముందు కూడా ఇలాగే చేశాడు. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించి తాను ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగాడు. కానీ జడేజా ఒత్తిడికి గురి కావడం, జట్టును సరిగా నడిపించలేకపోవడంతో సీజన్ మధ్యలో తిరిగి కెప్టెన్సీ తీసుకున్నాడు. గత సీజన్లో పూర్తిగా అతనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఈ సీజన్ ముంగిట రుతురాజ్‌కు పగ్గాలు అప్పగించాడు.
ఐతే ఈ సీజన్లో చెన్నై ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ధోని తిరిగి కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు లేనట్లే. ఎందుకంటే ధోని వచ్చే సీజన్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ. ఈ ఐపీఎల్ అయిన కొన్ని రోజులకు ధోనికి 43 ఏళ్లు నిండుతాయి. 40 ఏళ్లు దాటాక ఐపీఎల్ ఆడటం అంత తేలిక కాదు. ఎలాగోలా మూడేళ్లు కెరీర్‌ను పొడిగించాడు.
ధోని కెప్టెన్‌గా కొనసాగితే ఎన్నేళ్లయినా అతణ్ని కొనసాగించడానికి చెన్నై ఫ్రాంఛైజీకి ఓకే. కానీ ఒక స్థాయికి మించి ఆటలో కొనసాగడం కష్టం. ధోనికి ఇప్పటికే మోకాలి సమస్య ఉంది. మునుపట్లా బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. వికెట్ల మధ్య పరుగులోనూ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ఈ సీజన్ అయ్యాక అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలే ఎక్కువ. అందుకే ముందే కెప్టెన్సీని రుతురాజ్‌కు అప్పగించేశాడు. ఈ సీజన్లో అతణ్ని గైడ్ చేస్తూ చెన్నై జట్టును పటిష్టం చేయడానికి ధోని ప్రయత్నించనున్నాడు. సీజన్ చివర్లో అతను రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates