తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత.. అనేక సంచనాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోపణలు, వివాదాలను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడా సహించడం లేదు. ఏ చిన్న వివాదమైనా.. పెద్ద వివాద మైనా కూకటి వేళ్లతో సహా తొలగించేయాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివాదాల్లో చిక్కుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై గుండుగుత్తగా వేటు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?
ఇటీవల కాలంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీసు స్టేషన్ అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవలే.. ఓ సీఐని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత..అవినీతి ఆరోపణలతో ఒక కానిస్టేబుల్‌ను విధుల నుంచి తప్పించారు. ఇక, కొందరు పోలీసులు తీవ్ర నేరగాళ్లతోనూ చేతులు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రభుత్వం కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
దీంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో పిట్టను కూడా మిగల్చకుండా.. గుండుగుత్తగా అందరిపైనా వేటు వేసేశారు. అంతేకాదు.. వీరికి ఎక్కడా పోస్టింగు కూడా ఇవ్వలేదు. ఈ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో సీఐలు, ఎస్సైలు, ఏఎస్ ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఇలా.. మొత్తం 85 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరినీ గుండుగుత్తగా ఇక్కడ నుంచి తీసేసిన కమిషనర్ అడ్మిన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వీరి స్థానంలో వివిధ స్టేషన్ల నుంచి సిబ్బందిని తీసుకువచ్చి.. ఇక్కడ నియమించారు. ఇది సంచలన నిర్ణయంగా హోం శాఖ వర్గాలు చెబుతున్నారు.