35 ఏళ్ల స‌ర్వీస్‌ దొంగ.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌!

సాధార‌ణంగా ఏ ఉద్యోగంలో అయినా.. నిర్ణీయ వ‌య‌సు రాగానే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం.. పింఛను లేదా.. పీఎఫ్ తీసుకుని స‌ద‌రు ఉద్యోగులు.. ఇంటికే ప‌రిమితం అవుతారు. ఇలానే.. గ‌త 35ఏళ్లుగా దొంగ త‌నాలు చేస్తూ.. ఎవ‌రి కంటికీ చిక్క‌కుండా.. ఈ వృత్తితోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఓ పెద్దాయ‌న‌.. తాజాగా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపాడు. నిజానికి ఆయ‌న రిటైర్మెంట్ ప్ర‌క‌టించే వ‌ర‌కు కూడా.. త‌న కుటుంబానికి త‌ప్ప‌.. పొరుగింటి వారికి కూడా ‘ఈయ‌న దొంగ’ అనే మాట తెలియ‌దు.

అలా మేనేజ్ చేసుకుంటూ వ‌చ్చాడు. అయితే.. 35 ఏళ్ల చోర వృత్తికి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న కుటుంబం పండ‌గ చేసింది. వెంట‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది.. జైలుకు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.

ఆద్యంతం ఆసక్తి..

చోరీ వృత్తినే కులవృత్తిగా మార్చుకొని 35 ఏళ్లుగా సుమారు 1000కి పైగా చోరీలకు పాల్పడిన ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మైలాడుదురై జిల్లా అక్కూరు సిరుపులినాయనార్‌ వీధిలో ఉంటున్న శంకర్‌ ఇంట్లో ఏడు రోజుల క్రితం ప్రవేశించిన ఆగంతకుడు 44 సవర్ల నగలు చోరీ చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మీనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. కానీ, ఎంత‌కీ దొంగ ఆచూకీ చిక్క‌లేదు.

ఇంత‌లోనే శేఖ‌ర్‌(60) అనే వ్య‌క్తి చోరీల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడ‌నే విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేసింది. దీంతో ఆదిశ‌గా పోలీసులు దృష్టి పెట్టారు. శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. శేఖర్‌ 35 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతుండగా, అతనిపై నాగపట్టినం, కారైక్కాల్‌, మైలాడుదురై, కడలూరు, తిరువారూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో 100కు పైగా చోరీ కేసులున్నట్లు విచారణలో తెలిసింది.

అయితే.. ఏ కేసులోనూ.. ఆయ‌న‌ను పోలీసులు ప‌ట్టుకోలేక‌పోయార‌ట‌. ప‌ట్టుకున్నా.. వెంట‌నే బెయిల్ వ‌చ్చేసేద‌ట‌. ఇక‌, పగటి పూట పలు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతుంటాడట‌. మొత్తానికి 35 ఏళ్ల స‌ర్వీసుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజు.. ఇలా ఊచ‌లు లెక్కించాల్సి రావ‌డం.. శేఖ‌ర్ ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు పోలీసులు.