పండుగ వేళ సర్ ప్రైజ్ గిప్టు.. ఆఫీస్ బాయ్ కు కార్!

దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు వ్యవహరించే తీరు వార్తలుగా మారటం.. వైరల్ కావటం తెలిసిందే. ఇప్పటివరకు భారీ బహుమతులతో ఉద్యోగుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే సంస్థల గురించి విన్నప్పటికీ.. ఇప్పుడు చెప్పే కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది.

ఉద్యోగుల్ని సెలబ్రిటీలుగా పేర్కొనటం.. టాప్ ఆర్డర్ లో ఉన్న ఉద్యోగుల్నే కాదు.. తమ సంస్థలో ఎంతో కాలంగా పని చేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగులకు భారీ బహుమతుల్ని ఇచ్చి అసలుసిసలు పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం విశేషం. హరియాణాలోని ఒక ఫార్మా కంపెనీ తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు కార్లను బహుమతులుగా ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ కారు బహుమతిని పొందిన వారిలో సంస్థ ఆఫీసు బాయ్ కూడా ఉండటం విశేషం.

హరియాణాలోని మిట్స్ హెల్త్ కేర్ ఫార్మా సంస్థ దీపావళి సందర్భంగా ఈసారి వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ విజయంలో ఉద్యోగులదే కీలకపాత్ర అని పేర్కొంటూ.. వారంతా కమిట్ మెంట్ తో పని చేయటం కారణంగా కంపెనీని ముందుకు తీసుకెళుతున్నట్లుగా చెప్పారు. మాటలతో సరి పెట్టని ఆ సంస్థ.. చేతలతో ఉద్యోగులకు సర్ ప్రైజ్ చేశారు. అంతేకాదు.. తాము బహుమతిగా ఇస్తున్న కానుకలు దీపావళి కానుకలుగా చూడొద్దని.. కంపెనీపై వారు చూపించే నిబద్ధతకు.. విశ్వాసానికి బహుమతులుగా అభివర్ణించటంతో ద్వారా వారికి మరింత ఆనందాన్ని కలిగించేలా చేయటం గమనార్హం. బహుమతిగా ఇచ్చిన కారు టాటాకు చెందిన “పంచ్”.

కార్లను పొందిన వారిలో కొందరికి కారును ఎలా నడపాలో కూడా తెలియకపోవటమే కాదు.. వారు కలలో కూడా కారుకు యజమానులం అవుతామని ఊహించని వారే ఉండటం గమనార్హం. బహుమతులు పొందిన ఉద్యోగులు తమను తాము సెలబ్రిటీలుగా ఫీల్ కావాలని తాను ఆశిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎంకే భాటియా చెప్పారు. తన సంస్థ ఎన్నో ఎత్తుపల్లాల్ని చూసిందని..వారంతా తన వెంటే ఉండి.. తన కంపెనీ ఎదుగుదలకు సహకరించారన్నారు. నెల క్రితమే కార్లను బహుమతులుగా ఇచ్చినప్పటికి.. తాజాగా వాటికి సంబంధించిన వీడియోల్ని విడుదల చేయటంతో.. అవన్నీ వైరల్ గా మారాయి. రానున్న రోజుల్లో బహుమతులుగా కార్లను ఇచ్చే సంఖ్యను పన్నెండు నుంచి యాభైకు పెంచాలన్నదే తన ఉద్దేశంగా పేర్కొన్నారు.