ట‌మాటాల‌తో ఏపీ రైతుకు రూ.4 కోట్లు.. తెలంగాణలో రూ.2 కోట్లు

అప్పులు చేసి మ‌రీ వ్య‌వ‌సాయం చేస్తున్న రైత‌న్న‌ల‌కు ఏమీ మిగ‌ల‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే అన్న‌దాత‌లు తినేందుకు తిండి లేక క‌డుపు మాడ్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరిగిన ట‌మాట ధ‌ర పుణ్య‌మా అని రైతులు కోటీశ్వ‌రులు అవుతున్నారు. కొంత‌మంది అన్న‌దాత‌ల‌కు ట‌మాట‌లు అధిక లాభాల‌ను తెచ్చిపెడుతున్నాయి.

ఏపీలోని చిత్తూరు జిల్లా క‌ర‌క‌మండ్ల గ్రామానికి చెందిన ముర‌ళి.. ట‌మాటాల ద్వారా 45 రోజుల్లోనే రూ.4 కోట్లు సంపాదించ‌డం విశేషం. ముర‌ళి దంపతులు గ్రామంలోని 22 ఎక‌రాల భూమిలో ట‌మాట సాగు చేశారు. స‌రిగ్గా ధ‌ర పెరిగే నాటికి వీళ్ల పంట చేతికి వ‌చ్చింది. ఇంకేముంది ఏపీలోని మ‌ద‌న‌ప‌ల్లె ట‌మాట మార్కెట్‌తో పాటు ప‌క్క‌నే ఉన్న క‌ర్ణాట‌క‌లోనూ క‌లిపి 40 వేల ట‌మాట బాక్సుల‌ను విక్ర‌యించారు. దీంతో రూ.4 కోట్ల ఆదాయం వ‌చ్చింది. వ‌చ్చిన డ‌బ్బుతో రూ.1.5 కోట్ల అప్పులు తీర్చారు.

తెలంగాణ‌లోని మెద‌క్ జిల్లా కౌడిప‌ల్లి మండ‌లం మ‌హ్మ‌ద్ న‌గ‌ర్‌కు చెందిన బాన్సువాడ మ‌హిపాల్ రెడ్డి అనే రైతుది కూడా ఇలాంటి క‌థే. నెల రోజులుగా ట‌మాటాలు అమ్మి ఆయ‌న రూ.2 కోట్లు సంపాదించారు. అంతే కాకుండా మ‌రో రూ.కోటి రూపాయాల విలువైన పంట కోత‌కు సిద్ధంగా ఉంది. హైద‌రాబాద్ మార్కెట్లోనే హోల్‌సేల్ ధ‌ర కిలో రూ.100కు అమ్మి మ‌హేంద‌ర్ రెడ్డి కోటీశ్వ‌రుడ‌య్యారు. వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకున్న రైత‌న్న‌లు ఇప్పుడు ఇలా రూ.కోట్లు సంపాదించ‌డం చూస్తే ఎంతో ఆనందంగా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. పెరిగిన ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ప్ప‌టికీ రైతుకు మాత్రం మేలు చేస్తున్నాయి.