‘ట‌మాటాల ధ‌ర‌లు పెరిగితే.. తిన‌డం మానేయ్యండి’

ట‌మాటా.. ఇది లేనిదే ఏ కూర కూడా పూర్తి కాద‌న‌డంలో అతిశ‌యోక్తి కాదు. కానీ ప్ర‌స్తుతం దేశంలో టమాట ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయి. మ‌రోవైపు ట‌మాటల‌కు మునుపెన్న‌డూ లేనంత విలువ రావ‌డంతో వీటిని సైతం దొంగిలించ‌డం చూస్తున్నాం. అంతే కాకుంటా ట‌మాట పండించిన కొంత‌మంది రైతులు రూ.కోట్ల‌లో సంపాదిస్తున్నార‌నే మాట‌లూ వింటున్నాం. మ‌రోవైపు మునుపెన్న‌డూ లేని రీతిలో దీని ధ‌ర అమాంతం పెరిగిపోవ‌డంతో సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నారు. కానీ ఇలా ధ‌ర‌లు పెరిగాయ‌ని మొత్తుకోవ‌డం ఎందుకు? ట‌మాట తిన‌డం మానేస్తే స‌రిపోతుంది క‌దా అని ఓ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మ‌హిళా మంత్రి ఉచిత స‌లహానిచ్చారు.

ట‌మాల ధ‌ర‌లు పెరిగాయ‌ని బాధ ప‌డ‌డం ఎందుకు? వీటిని తిన‌య‌డం మానేయొచ్చు క‌దా అని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్ర‌తిభా శుక్లా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఓ మ‌హిళా అయి ఉండి.. అందులోనూ ఓ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమిటనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం కృషి చేయ‌డం మాని ఇలాంటి ఉచిత స‌ల‌హాలు బాగానే ఇస్తున్నార‌ని జ‌నం అంటున్నారు. దీంతో త‌న వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతాయ‌ని ఊహించిన ఆ మంత్రి వెంట‌నే మాట మార్చారు.

ట‌మాటాల ధ‌ర పెరిగిపోతుంద‌ని బాధ ప‌డ‌డం మానేసి.. వీటిని ఇంటి ద‌గ్గ‌రే పెంచుకుంటే స‌రిపోతుంది క‌దా అని మంత్రి ప్ర‌తిభా శుక్లా మ‌రో ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. యూపీ ప్రభుత్వ స‌హ‌కారంతో అలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, ట‌మాటాలు తిన‌డం మానేస్తే రేట్లు దిగివ‌స్తాయ‌ని కూడా ఆమె చెప్పారు. అంతే కాకుండా అస‌లు ట‌మాటాలకు బ‌దులు నిమ్మ‌కాలు తింటే స‌రిపోతుంద‌ని కూడా స‌ద‌రు మంత్రి సెల‌విచ్చారు. దేశంలో ఎవ‌రూ ట‌మాటాలు తిన‌క‌పోతే రేట్లు ఎందుకు దిగిరావో చూద్దామంటూ పేర్కొన్నారు. మంత్రి ఇలా చెప్ప‌డంపై ప్ర‌జ‌లు విభిన్న అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. టమాట బ‌దులు నిమ్మ‌కాయాలు ఎలా తింటారో? చెప్పాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు.