దయాగా JD చక్రవర్తి సరైన రీ ఎంట్రీ

Hotstar Specials Dayaa | Official Telugu Trailer | 4th Aug | JD Chakravarthy | DisneyPlus hotstar

1989లో వచ్చిన నాగార్జున శివ ఎప్పటికీ మర్చిపోలేని సెన్సేషన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకే కాదు దానికి పని చేసిన, నటించిన ప్రతి ఒక్కరికి ఎంతో లైఫ్ ఇచ్చింది. అందులో ప్రధానంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి జెడి చక్రవర్తి. తలపొగరుతో మిడిసిపడే విద్యార్ధి పాత్రలో అతను సహజంగా నటించిన తీరు చాలా పేరు తీసుకొచ్చింది. తర్వాత హీరోగా మారి గులాబీ, అనగనగా ఒక రోజు, బొంబాయి ప్రియుడు లాంటి ఎన్నో హిట్ సినిమాలతో తన గ్రాఫ్ పెంచుకున్నాడు. కానీ వరస ఫ్లాపుల వల్ల ఇండస్ట్రీకి త్వరగానే దూరం కావాల్సి వచ్చింది. చైతు జోష్ లో రీ ఎంట్రీ ఇచ్చినా పనవ్వలేదు.

తాజాగా దయాగా ఓటిటి ఎంట్రీ ఇస్తున్నాడు. హాట్ స్టార్ లో ఆగస్ట్ 4న విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కు దర్శకుడు పవన్ సాధినేని. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. చేపలు రవాణా చేసే ఫ్రీజర్ వాన్ డ్రైవర్ దయా(జెడి చక్రవర్తి). ఇతనిదో సాధారణ కుటుంబం. భార్య(ఈషా రెబ్బా)గర్భవతి. దయాకి ఒక చెవి వినిపించదు. ఓ పెద్ద న్యూస్ ఛానల్ లో పని చేసే లేడీ జర్నలిస్టు కనిపించకుండా పోతుంది. ఆమె శవం దయా వాహనంలో దొరుకుతుంది. అక్కడి నుంచి అతని లైఫ్ అల్లకల్లోలమైపోయి ప్రాణం కోసం పరుగులు మొదలుపెడతాడు. ఇక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది.

ఆద్యంతం మంచి థ్రిల్స్ తో రూపొందిన దయా మీద అంచనాలు పెరిగేలాగే ట్రైలర్ కట్ చేశారు. విజువల్స్ లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా జెడి చక్రవర్తికి తగ్గ క్యారెక్టర్ దొరికినట్టు అనిపిస్తోంది. మెషీన్ పెట్టుకుంటే కానీ ఒక చెవి వినిపించని పాత్రని సెట్ చేశారు. థియేటర్ కంటెంట్ ఫీలింగ్ ఇస్తున్న దయా నిజంగానే హైప్ ని అందుకోగలిగితే హిట్టు పడ్డట్టే. వయొలెన్స్ ని మరీ మోతాదు మించకుండా సినిమా ఫార్మాట్ లోనే దర్శకుడు పవన్ సాధినేని రూపొందించారు. మరి జెడి కోరుకున్న సెకండ్ బ్రేక్ కనక ఇది ఇవ్వగలిగితే ఇకపై వరసగా తెరపై చూడొచ్చు.