ఈ కి‘లేడీ’కి 8 మంది భర్తలు

ఈ హైటెక్ జమానాల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్..అరచేతిలో వైకుంఠమే కాదు ప్రపంచాన్ని కూడా చూపిస్తోంది. వందల కొద్దీ డేటింగ్ వెబ్సైట్ లు, పదుల కొద్దీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు వెరసి ఆన్లైన్ లో చాలామంది ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఇదే అదునుగా మరికొందరు కేటుగాళ్లు, కిలాడీలు, కిలేడీలు సోషల్ మీడియా వేదికగా సరికొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిలేడీ…నిత్య పెళ్లికూతురుగా అవతారం ఎత్తి సోషల్ మీడియాలో ఎనిమిది మందిని బురిడీ కొట్టించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

బాగా డబ్బున్న బడా బాబులకు ప్రేమ వల వేసే ఈ కిలేడీ…ఆ తర్వాత పద్ధతిగా పెళ్లి కూడా చేసుకుంటుంది. అయితే, పట్టుమని పది నెలలు కూడా కాపురం చేయకుండా తన భర్తకు చెందిన డబ్బులు, నగలు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా, ఏకంగా 8 మందిని రషీదా అనే యువతి మోసం చేసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్సర్ మూర్తి ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రషీదాతో మూర్తికి పరిచయం ఏర్పడింది.

గంటల కొద్ది చాటింగ్ తర్వాత ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు మూర్తి, రషీదాలు. ఈ క్రమంలోనే ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసి అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. మార్చి 30న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు కాపురం సజావుగా చేసినా….ఆ తర్వాత మూర్తితో గొడవలు పెట్టుకునేది రషీదా. చివరకు జులై 4న ఇంట్లో ఉన్న లక్షన్నర డబ్బుతో పాటు ఐదు సవర్ల బంగారం తీసుకొని రషీదా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రషీదా గుట్టు రట్టయింది.

అయితే, రషీదా ఇలా మోసం చేయడం తొలిసారి కాదు. కేరళ, కర్ణాటక, ఏపీలో 8 మందిని పెళ్లి చేసుకొని ఈ తరహాలోనే కొద్ది నెలలు కాపురం చేసి డబ్బు, నగలతో ఉడాయించిందని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి బాగా డబ్బున్న వారికి వలవేసి వంచించడమే ఆమె ప్రవృత్తి అని పోలీసులు గుర్తించారు. రషీదా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ తరహా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.