పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని.. చివరకు వీర్య పరీక్షకు కూడా సిద్ధపడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుర్తున్నాడా.! తనే దేవుడినని చెప్పుకొన్న ఆయనను అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన దరిమిలా.. ఓవర్ నైట్ ఆయన ఈ దేశాన్ని వదిలి పారిపోయాడు. అయితే.. రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చినా.. ఆయన జాడ తెలియలేదు. తర్వాత.. కొన్నాళ్లకు.. కొన్నేళ్లకు.. ఆయనే స్వయంగా ముందుకు వచ్చి.. తాను కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించాడు.
ఇక, ఈ దేశానికి ఐక్యరాజ్యసమితి కూడా గుర్తింపు ఇచ్చినట్టు కొన్నాళ్ల కిందట ప్రచారం జరిగింది. రెండు మాసాల కిందట ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కైలాస దేశం నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇక, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసగా పేర్కొనే ఈ దేశానికి ప్రత్యేకంగా కరెన్సీ ఉంది. అదివిధంగా పాస్ పోర్టులు, వీసాలు.. ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి.
తాజాగా ఇప్పుడు కైలాస దేశానికి లేడీ ప్రధాని కూడా నామినేట్ అయినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. నిత్యానందకు ఒకప్పటి ప్రియురాలు(అనే ఆరోపణలు, కేసులు కూడా ఉన్నాయి), శిష్యురాలు, తమిళ, కన్నడ సినీ నటి రంజితను కైలాస దేశానికి ప్రధానిగా ప్రకటించాడు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సహా ఒక ప్రముఖ తమిళ పత్రిక వెల్లడించింది.
రంజిత పలు తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే నిత్యానంద వద్దకు చేరింది. నిత్యానంద, రంజిత మధ్య శారీరక సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా గతంలో పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత..లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి.