భరత్ జైన్.. రూ. 7.5 కోట్ల విలువైన ఆస్తులు, నెలకు 75 వేల రూపాయల సంపాదన, ముంబయిలో ఖరీదైన ప్రాపర్టీస్. ఇవన్నీ వింటుంటే ఈయనేదో ప్రభుత్వ ఉన్నతోద్యోగో.. కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తో.. లేదంటే, మాంచి వ్యాపారం చేస్తున్న బిజినెస్‌మేనో అనిపించొచ్చు. కానీ, ఈయన వృత్తి బెగ్గింగ్. అవును.. భిక్షాటన చేసే ఆయన ఇన్ని కోట్లు సంపాదించారు. అందుకే.. దేశంలోనే అత్యంత ధనికుడైన బెగ్గర్‌గా ఆయన పేరు వినిపిస్తోంది.
భరత్ జైన్ చిన్నతనంలో ఆయన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన పెద్దగా చదువుకోలేకపోయాడు. బెగ్గింగ్ ద్వారా సంపాదించే డబ్బుతో ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తమ్ముడు, తండ్రి బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. ముంబయిలో కోటీ 20 లక్షల రూపాయల విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇల్లు ఆయనకు ఉంది. అంతేకాదు.. థానేలో రెండు షాప్‌లున్నాయి. ఆ రెండు షాపుల నుంచి ఆయనకు నెలకు రూ. 30 వేల అద్దె వస్తుంది.
ముంబయిలోని ఖరీదైన ప్రాంతాలు, ఛత్రపతి శివాజీ టెర్మినస్, అజాద్ మైదాన్ వంటి ప్రాంతాలలో అడుక్కుంటూ కనిపిస్తుంటాడు భరత్ జైన్. ఎన్ని ఆస్తులు సంపాదించినా యాచక వృత్తి మాత్రం ఆయన మానలేదు. రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 2,500 వరకు సంపాదిస్తాడు భరత్ జైన్. కోటీ 20 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చేసి పరేల్‌లో ఉన్న సింగిల బెడ్ రూమ్ డ్యూప్లెక్స్ ఇంట్లో ఉంటోంది భరత్ జైన్ కుటుంబం.
జైన్ తన పిల్లలను కాన్వెంట్ స్కూళ్లలో చదివించాడు. ఆయన ఇంట్లోని మిగతా వాళ్లు ఒక స్టేషనరీ షాప్ నడుపుతున్నారు. అద్దెలు, స్టేషనరీ షాప్ ద్వారా వచ్చే ఆదాయం చాలని.. బెగ్గింగ్ మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా భరత్ జైన్ మాత్రం వినడు. నెలకు సుమారు రూ. 75 వేల ఇన్కమ్ ఎందుకు వదులుకోవాలంటూ తెల్లారితే రోడ్లపై భిక్షాటన ప్రారంభిస్తాడు. ఈ దేశంలో భరత్ జైన్ అందరికంటే ధనవంతుడైన బెగ్గర్ అని చెప్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates