ఈ హైటెక్ జమానాలో కార్పొరేట్ ఆఫీసులలో యువతీయువకులు, పురుషులు, మహిళలు కలిసి పనిచేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు సహోద్యోగుల మధ్య వివాహేతర సంబంధాలు, అఫైర్లు నడుస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఇటువంటి వ్యవహారాలు కంపెనీలో అంతర్గతంగా ఉద్యోగులకు మాత్రమే తెలుస్తాయి. ఆ అఫైర్ల వల్ల ఏవైనా సమస్యలు వస్తే సదరు ఉద్యోగులు వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటుంటారు.
ఒకవేళ యాజమాన్యానికి ఆ అఫైర్ గురించి తెలిసినా వారిని వ్యక్తిగతంగా మందలించే పరిస్థితి ఉండదు. దాదాపుగా ఏ కంపెనీ యాజమాన్యం కూడా అటువంటి ఉద్యోగుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి వారిని ఉద్యోగంలో నుంచి తీసివేయడం వంటి చర్యలకు ఉపక్రమించదు. మరీ పరిస్థితి చేయిదాటి సదరు ఉద్యోగుల అఫైర్ వ్యవహారం కంపెనీకి, తోటి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారితే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగుల వ్యక్తిగత విషయాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అంతేకాదు, పెళ్లయిన ఉద్యోగులు, అక్రమ సంబంధాల జోలికి వెళితే ఉద్యోగం నుంచి పీకి పడేస్తామని వార్నింగ్ ఇస్తోంది.
జింజాంగ్ నగరంలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులు అఫైర్లకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం వైరల్ గా మారింది. కంపెనీ అంతర్గత నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుటుంబం పట్ల ఉద్యోగులు విధేయత చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. పనిపై ఫోకస్ చేయడం, భార్యాభర్తల మధ్య మెరుగైన సంబంధాల కోసం ఇటువంటి వివాహేతర సంబంధాలను నిషేధించామని ఆ కంపెనీ పేర్కొంది. అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.
అక్రమ సంబంధాలు, ఉంపుడుగత్తెలు, వివాహేతర సంబంధాలు, విడాకులు వద్దు అంటూ నాలుగు మార్గదర్శకాలను ఉద్యోగులకు కంపెనీ జారీ చేసింది. ఏది ఏమైనా, ప్రపంచంలోనే ఈ తరహా కండిషన్లు పెట్టిన తొలి కంపెనీగా ఆ చైనా కంపెనీ అవతరించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.