‘కోరిక తీర్చు.. ఖర్చు భరిస్తా’ ఎఫ్ఐఆర్ లో బ్రిజ్ లీలల బయటకు

వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల సమాఖ్యకు చీఫ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు గొంతు చించుకుంటున్నా.. ఇప్పటివరకు వారి మొరను పట్టించుకున్న పాపాన పోలేదు.

మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు పలువురు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీం వరకు విషయం వెల్లటంతో వారు ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఇక.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తాజాగా మీడియాలోకి వచ్చాయి. క్రీడాకారిణులు చేసిన ఫిర్యాదుల్లోని అంశాల్ని చూస్తే.. షాకింగ్ గా మారక మానదు. అందులో ఉన్న కీలక అంశాల్ని చూస్తే.. ఇంత దారుణాలకు పాల్పడినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఎందుకు సిద్ధంగా లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని కన్షాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లోని అంశాల్ని చూస్తే..

  • మాతో అనుచితమైన రీతిలో.. దారుణ బెదిరింపులకు పాల్పడే వారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారు. ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడూ తమ గదుల్లో నుంచి ఒంటరిగా బయటకు వచ్చేవారు కాదు. టీంలుగానే బయటకు వచ్చేవారు.
  • అప్పటికి ఆయన మా టీంలోని ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారు. వాటికి సమాధానాలు చెప్పలేక పోయేవాళ్లం.
  • ఒక రోజు నన్ను పిలిచి.. నా టీ షర్టు లాగారు. శ్వాస ప్రక్రియను చెక్ చేస్తున్నట్ులగా చెప్పి.. నా ఛాతీ.. పొట్టను అభ్యంతరకరంగా తాకారు.
  • ఒకసారి నాకు తెలీని ఒక పుడ్ ను తీసుకొచ్చి తినాలని చెప్పారు. దాంతో నేను మరింత ఫిట్ అవుతానని చెప్పారు.
  • కోచ్ లేని వేళలో వచ్చేశారు. అభ్యంతరకరంగా ప్రవర్తించేవారు. విదేశాల్లో జరిగిన పోటీల్లో గాయపడ్డాను. నా వద్దకు వచ్చి తనతో సాన్నిహిత్యంగా ఉంటే ట్రీట్ మెంట్ ఖర్చులన్నీ ఫెడరేషన్ భరిస్తుందని చెప్పారు.
  • బలవంతంగా గట్టిగా హత్తుకొని ఫోటో తీసుకుందామంటూ ఒత్తిడి చేశారు.
  • రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ వినోద్ తోమర్ సైతం లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అందరిని గదిలో నుంచి బయటకు పంపి.. నన్ను బలవంతంగా ఆయనవైపు లాక్కునేవారు.
    ఇదంతా ఇలా ఉంటే.. తనపై క్రీడాకారులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని.. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపితమైనా.. తనను తాను ఆత్మహత్య చేసుకుంటానని బ్రిజ్ చెబుతున్నారు. ఆయనపై ఇప్పటివరకు కేసు నమోదు చేసింది లేదు. మరోవైపు నిరసన చేస్తున్న వారి ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజమని నిరూపించినా తనను తాను ఊరేసుకొని చనిపోతానని బ్రిజ్ చెప్పటం గమనార్హం.