సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేర్లు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. ఇండస్ట్రీలో మాత్రం వీళ్లు బిగ్ షాట్సే. ఏషియన్ సినిమాస్ పేరుతో హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉన్న మల్టీప్లెక్సులు వీళ్లవే. పీవీఆర్, ఐనాక్స్ లాంటి పెద్ద థియేటర్ ఛైన్స్కు దీటుగా తెలంగాణలో మల్టీప్లెక్సుల్ని విస్తరించారు.
కొన్నేళ్ల కిందట డిస్ట్రిబ్యూషన్లోకి కూడా అడుగు పెట్టి అందులోనూ దూసుకెళ్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సహా ఎన్నో చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూషన్లో ఓ స్థాయి అందుకున్నాక నిర్మాణంలోకి రావడం మామూలే. పైగా వీరి చేతిలో పెద్ద ఎత్తున థియేటర్లూ ఉన్నాయి.
గత ఏడాదే ‘శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ’ పేరుతో నిర్మాణ సంస్థ పెట్టి ప్రొడక్షన్లోకి కూడా అడుగు పెట్టారు నారంగ్స్. ఈ బేనర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘లవ్ స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది.
లాక్ డౌన్ లేకుంటే ఈపాటికి ఈ చిత్రం విడుదల కావాల్సింది. అనివార్య కారణాలతో ఆలస్యమైంది. ఐతే ఈ సినిమా విడుదలయ్యే లోపే ఒకటికి నాలుగు కొత్త చిత్రాల్ని లైన్లో పెట్టారు సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇటీవలే అనౌన్స్ చేసిన సినిమా అందులో ఒకటి.
దీంతో పాటే అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ సినిమా లైన్లో పెట్టారు. ఇవి కాక తాజాగా నిఖిల్ హీరోగా ఓ కొత్త సినిమాను ప్రకటించారు. దానికి దర్శకుడెవరో ఇంకా వెల్లడించలేదు. ‘లవ్ స్టోరి’ తర్వాత తన తర్వాతి చిత్రాన్ని కూడా కమ్ముల ఇదే బేనర్లో చేయబోతున్నారు. నటీనటులు ఖరారవ్వలేదు.
ఇలా వరుసబెట్టి దర్శకులు, హీరోల దగ్గర కమిట్మెంట్లు తీసుకుంటూ.. ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నారు ఈ కొత్త నిర్మాతలు. మున్ముందు మరిన్ని భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారని అంటున్నారు. లాక్ డౌన్ వేళ అగ్ర నిర్మాతలంతా సైలెంటుగా ఉంటే కొత్త ప్రొడ్యూసర్లు ఇంత అగ్రెసివ్‌గా సినిమాలు అనౌన్స్ చేస్తుండటం విశేషమే.