చైనాలో ప్రభుత్వం తీసుకొనే చాలా నిర్ణయాలు వినూత్నంగా ఉంటుంటాయి. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం, అవి కాస్తా వివాదాస్పదంగా మారడం తెలిసిందే. చావనైనా చస్తాం ..మాకు ఈ లాక్ డౌన్ ఎత్తేయండి మహా ప్రభో అంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇటీవల నిరసన తెలిపిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా చైనా ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం వార్తల్లో నిలిచింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాకు పేరుంది. అయితే, ప్రస్తుతం చైనాలో జననాల రేటు తగ్గుతూ వస్తోంది. దీంతో, చైనా సర్కార్ అక్కడ జనాభా పెంచేందుకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జననాల రేటు పెంచేందుకు కాలేజీలలో లవ్ హాలిడేస్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. ప్రేమించుకోండి అంటూ ఏప్రిల్ లో ఏకంగా వారం రోజుల పాటు సెలవుల వరాన్నిచ్చింది చైనా ప్రభుత్వం. ఈ నిర్ణయంతో కుర్రకారు హుషారుగా ఉన్నప్పటికీ…చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.
జీవితాన్ని ప్రేమించండి…జీవితాన్ని ఆస్వాదించండి అంటూ నినదిస్తున్న చైనా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జననాల రేటును పెంచేందుకు ఇంతకంటే గొప్ప మార్గం దొరకలేదా అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి చైనాలో 1980-2015 మధ్యకాలంలో ఒక జంటకు ఒక బిడ్డ అనే నిర్బంధాన్ని ప్రభుత్వం విధించింది. దీంతో, ప్రస్తుతం జనాభా తగ్గుముఖం పట్టింది. ఇక, కోవిడ్ తర్వాత అయితే, జంటలు ఒకరినే కనడానికి ఇష్టపడుతున్నాయి.
ముగ్గురు పిల్లలుంటే ప్రోత్సాహకాలిస్తామన్నా సరే…సరైన ఆదాయ వనరులు లేక పిల్లల పోషణ భారం అవుతుందని చాలామంది ఎక్కువమంది పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు. అందుకని, దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు రకరకాల కార్యక్రమాలు చేపట్టింది. ఏది ఏమైనా చైనాలో ‘లవ్ హాలిడేస్’..కాన్సెప్ట్ నెట్టింట వైరల్ గా మారింది.