భూకంపం గురించి ముందే వార్నింగ్ ఇచ్చాడు

కనివినీ ఎరుగని విపత్తు విరుచుకుపడింది. పుడమితల్లి కాస్తంత కదిలింది. దానికే మనిషి కోలుకోలేనంత భారీ నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అత్యుత్తమ సాంకేతికతను అందిపుచ్చుకున్నామని చెప్పే ఈ రోజుల్లో భూకంపం లాంటి తీవ్ర విపత్తును ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థలు కచ్ఛితంగా ఏమీ లేని పరిస్థితి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తుర్కియే.. సిరియాల్లో చోటు చేసుకున్న భారీ భూకంపం కారణంగా 4500 మంది వరకు మరణించారని చెబుతున్నారు. ఇక.. ఆస్తి నష్టం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

అయితే.. ఈ భారీ భూకంపం గురించి ఒక నిపుణుడు ముందుగా హెచ్చరించిన విషయం తాజాగా వెలుగు చూసింది. భూకంపం చోటు చేసుకోవటానికి మూడు రోజులు ముందే ఆయన హెచ్చరికలు చేసినప్పటికీ సరైన రీతిలో స్పందించకపోవటం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం కూడా భారీ ప్రాణ.. ఆస్తి నష్టానికి కారణమని చెబుతున్నారు. భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హుగర్ బీట్స్ విరుచుకుపడనున్న ఉత్పాతాన్ని గుర్తించి హెచ్చరికలు చేశారు.

దీనికి సంబంధించిన ట్వీట్ ఆయన ఫిబ్రవరి మూడున పోస్టు చేస్తూ.. “దక్షిణ మధ్య తుర్కియే..జోర్డాన్.. సిరియా.. లెబనాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశం ఉంది. 7.5 తీవ్రత ఉండనుంది” అని పేర్కొన్నారు. ఆయన అంచనా వేసినట్లే.. సరిగ్గా మూడు రోజులకు అంటే ఫిబ్రవరి ఆరున తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని క్రియేట్ చేయటమే కాదు.. అంతులేని విషాదాన్ని తీసుకొచ్చాయి.

తాజాగా చోటు చేసుకున్న విలయం నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలిచివేసిందని.. తాను భూకంపం వస్తుందని ముందే చెప్పానని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ భూకంపం 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అంచనా వేశా. సంక్లిష్ట రేఖా గణితం ఆధారంగా అంచనా వేశాం. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన భూకంపాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది. మరిన్ని ప్రకంపనలకు అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.

ఆయన అలా చెప్పిన గంటల వ్యవధిలోనే ప్రకంపనలు చోటుచేసుకోవటం.. తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే.. ఆయన మాటల్ని కొందరు తప్పు పడుతున్నారు. గతంలో ఆయన వేసిన అంచనాలు తప్పు అయ్యాయని చెబుతున్నారు. అయితే.. కొన్ని విపత్తుల మీద చెప్పే అంచనాలను నిపుణులు క్రాస్ చెక్ చేయటం ద్వారా.. మహా విషాదాల్ని అడ్డుకునే వీలుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆ పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది.