క్రైం మూవీ సీన్ కాదు.. ఒక హెడ్ కానిస్టేబుల్ ఆరాచకం

కాసుల కక్కుర్తి కోసం నిండు ప్రాణాల్ని తీసిన ఒక పోలీసు దుర్మార్గమిది. సాధారణంగా క్రైం సినిమాల్లో కనిపించే ఇలాంటి సీన్.. రియల్ గా చోటు చేసుకుందంటే నమ్మశక్యంగా అనిపించదు. కానీ.. పోలీసులు జరిపిన విచారణలో ఈ దుర్మార్గం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. ఒక అనాథ వ్యక్తి పేరు మీద బీమా చేయించి.. ఆ డబ్బుల్ని సొంతం చేసుకోవటం కోసం అతన్ని చంపేసిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఆరాచకం తాజాగా వెలుగు చూసింది. అసలేం జరిగిందన్నది చూస్తే..

వరంగల్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ జల్సా పురుషుడు. నిద్ర లేచించి మొదలు జల్సాలు చేసుకోవటం.. విలాసంగా బతకటం అతనికి ఇష్టం. అతని వద్ద హైదరాబాద్ శివారు (మేడిపల్లి)కు చెందిన భిక్షపతి కారు డ్రైవర్ గా పని చేసేవాడు. అతడో అనాధ. దీంతో భిక్షపతి పేరు మీద రూ.50 లక్షలకు ఒక బీమా సంస్థలో అతని పేరున పాలసీ చేయించాడు. అంతేకాదు.. అతని పేరు మీద అదే బీమా సంస్థకు సంబంధించిన బ్యాంక్ లో రూ.52 లక్షల భారీ మొత్తాన్ని ఇంటికి రుణంగా తీసుకొని కొనుగోలు చేశారు. నామినీగా తన పేరును పెట్టుకున్నాడు శ్రీకాంత్.

అంతా సెట్ చేసి.. బీమా డబ్బుల కోసం అతన్ని చంపేసే దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. అయితే.. తన ప్లాన్ కరెక్టుగా వర్కువుట్ అయ్యేందుకు వీలుగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మోతీలాల్ తో డీల్ మాట్లాడుకున్నాడు. అంతేకాదు.. తన దగ్గర పని చేసే సతీశ్.. సమ్మన్నలను కూడా డబ్బులు ఆశ చూపించి.. వారిని ఒక జట్టుగా చేశాడు. తాము వేసుకున్న ప్లాన్ లో భాగంగా 2021 డిసెంబరు 22న కారు డ్రైవర్ భిక్షపతిని కారులో ఎక్కించుకొని బాగా తాగించారు. అర్థరాత్రి వేళలో షాద్ నగర్ కు చేరుకొని.. ఆ తర్వాత మొగలిగిద్ద వైపు వెళ్లారు. గ్రామ శివారులో హాకీ స్టిక్ తో దాడి చేసి హత్య చేశారు.

శవంపైన కారును రెండుసార్లు పోయేలా చేసి.. అతను చనిపోయిన వైనాన్ని చెక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. రోడ్డు మీద ఉన్న శవాన్ని చూసిన పోలీసులు.. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత.. అందులో పేర్కొన్న అంశాల్ని చూసి హత్య కేసుగా మార్చారు. భిక్షపతిని తాము అనుకున్న రీతిలో అంతమొందించిన నేపథ్యంలో.. అతడి పేరు మీద ఉన్న బీమా సొమ్ముల కోసం ప్రయత్నాలు షురూ చేశారు. బీమా డబ్బుకోసం ప్రయత్నిస్తున్న వ్యక్తికి భిక్షపతికి ఎలాంటి బంధుత్వం లేకపోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

దీంతో.. వారిని అదుపులోకి తీసుకొన్నారు. తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత తాము చేసిన దుర్మార్గాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో శ్రీకాంత్ ఆరాచకంతో పాటు.. హెడ్ కానిస్టేబుల్ దుర్మార్గం బయటకు వచ్చింది. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. క్రైం మూవీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్లాన్ చేసిన వీరి దుర్మార్గం గురించి విన్నవారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.