రిషి కులం ఏంటి.. మనం మారముగా

ఆరేళ్ల కిందట తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజతం గెలవడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగిపోయింది. అప్పటిదాకా ఆమె గురించి పెద్దగా తెలియని వాళ్లందరూ ఇంటర్నెట్ మీద పడిపోయారు.

తన గురించి గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఐతే ఆ టైంలో ఎక్కువగా ఆమె గురించి శోధించిన ప్రశ్న ఏంటో తెలుసా? తన కులం ఏంటి అని. భారతీయ కీర్తి పతాకను ప్రపంచస్థాయిలో ఎగురవేసిన అమ్మాయి ప్రతిభా పాటవాలు, తన సాధన, తన ప్రయాణం గురించి తెలుసుకోవాల్సింది పోయి తన కులం గురించి వెతికే పనిలో పడి తమ చీప్ మెంటాలిటీని బయటపెట్టుకున్నారు జనాలు.

ఇందులో ఎక్కువగా ఉన్నది తెలుగువారే కావడం గమనార్హం. ఇలా ప్రపంచ స్థాయిలో ఎవరు పాపులర్ అయినా.. మన వాళ్లు ఆ జాఢ్యాన్ని వదిలించుకోవట్లేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని అయిన భారతీయుడు రిషి సునాక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

మనల్ని రెండొందల ఏళ్లు పరిపాలించిన బ్రిటన్‌కు ఒక భారతీయ సంతతి వ్యక్తి ప్రధాని అయినందుకు గర్వించడం పోయి.. రిషి కులం ఏంటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇండియన్ నెటిజన్లు. అసలు ఇండియాతో రిషికి ఉన్న కనెక్షనేంటో తెలుసుకుంటూనే పనిలో పనిగా ఆయన కులం ఏంటో శోధిస్తున్నారు. రిషి భార్య అక్షితా మూర్తి బ్రాహ్మణ కులానికి చెందిన అమ్మాయి కాబట్టి ఆయన కూడా బ్రాహ్మణుడే అయ్యుంటాడని అంటున్నారు. కానీ రిషి అయితే ఎక్కడా తన కులం గురించిన ప్రస్తావన తేవట్లేదు.

ఐతే తాను ఒక హిందువునని మాత్రం ముందు నుంచి గర్వంగా చెప్పుకుంటున్నారు. ప్రధానిగా తన పేరు ఖరారైన అనంతరం ఆయన బ్రిటన్‌లోని ఒక ఇస్కాన్ టెంపుల్‌కు కూడా వెళ్లారు. ఈ సంగతి పక్కన పెడితే రిషి గురించి భారతీయులు ఎక్కువగా శోధిస్తున్నది మాత్రం ఆయన కులం గురించే అని గూగుల్ స్పష్టం చేస్తుండడం మన వాళ్ల మెంటాలిటీకి అద్దం పడుతోంది.