టీ20: పాక్‌ పై క‌సి తీర్చుకున్న భార‌త్‌..

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీం ఇండియా చిరస్మరణీయం విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విక్టరీ నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఈ విజ‌యంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జ‌రిగిన టీ20లో భార‌త్‌పై పాక్‌పై క‌సితీర్చుకున్న‌ట్ట‌యింది.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడిన వేళ మైదానంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు ఆనందోత్సాహాలతో గంతులేశారు. కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోరుల్, 4 సిక్సులున్నాయి.

చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, పాక్ స్పిన్నర్ నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పాండ్యా అవుటవడంతో మైదానంలో నిశ్శబ్దం ఆవరించింది. కానీ కోహ్లీ ఓ బంతిని సిక్సర్ గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించగా, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ బంతి ఫీల్డర్ల నుంచి దూరంగా వెళ్లడంతో కోహ్లీ, కార్తీక్ మూడు పరుగులు తీయడంతో చివర్లో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి.

ఈ దశలో కార్తీక్ అవుట్ కావడంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. నవాజ్ ఓ వైడ్ విసరడంతో స్కోర్లు సమయం అయ్యాయి. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, అశ్విన్ ఓ లాఫ్టెడ్ డ్రైవ్ తో విన్నింగ్ షాట్ కొట్టాడు. సీన్ కట్ చేస్తే…. భారత్ గెలిచింది, పాక్ ఓడింది. టీమిండియా శిబిరంలోనూ, స్టేడియంలో ఉన్న భారత అభిమానుల్లోనూ జోష్ అంబరాన్నంటింది.

స్కోర్ల విషయానికొస్తే…

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యఛేదన‌లో భారత్ కు ఆరంభంలో ఒకింత‌ ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా జోడీ భారత్ ను ఆదుకుంది.

తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ, ఆ తర్వాత గేర్లు మార్చి హిట్టింగ్ ప్రారంభించింది. పాండ్యా 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ఓ దశలో 20 బంతుల్లో 50 పరుగులు చేయాల్సి వచ్చినా కోహ్లీ, పాండ్యా జోడీ వెనుకంజ వేయలేదు. సిక్సర్ల మోత మోగించి రన్ రేట్ తగ్గించారు. ఏదేమైనా కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఈ రోమాంఛక మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు తీశారు.

దాయాదులు భారత్, పాక్ తలపడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ మ్యాచ్ ఓ తార్కాణంలా నిలిచిపోతుంది. నరాలు తెగే ఉత్కంఠ, పోరాట పటిమ, దమ్ము, ధైర్యం, తమ జట్టును గెలిపించాలన్న కసి ఇరుజట్ల ఆటగాళ్లలో స్పష్టంగా కనిపించాయి. ఇక ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు వేదికగా నిలిచిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ 90 వేలు కాగా, మైదానం క్రిక్కిరిసి పోయిందంటే అది భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ ఎలా ఉందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.