దేశంలో ప్రైవేటు జైళ్ళా ?

ఐరోపా దేశాల్లో ఉన్నట్లు మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు ఎందుకు నిర్మించకూడదు ? ఇది ఎవరో వేసిన ప్రశ్నకాదు. ఒక కేసు విచారణ సందర్భంగా స్వయాన సుప్రీంకోర్టు చేసిన కామెంట్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రైవేటు జైళ్ళ నిర్మాణ ప్రస్తావన తెచ్చిందో వెంటనే ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు విచారణ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ మన జైళ్ళలో రద్దీ బాగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. మన జైళ్ళల్లో అత్యధికం నరకాలకన్నా మరీ అన్యాయంగా ఉంటుంది.

రద్దీ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనదేశంలో కూడా ప్రైవేటు జైళ్ళు నిర్మించాలి కోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద కార్పొరేట్ సంస్ధలే ప్రైవేటు జైళ్ళ నిర్మాణానికి పూనుకోవాలని కూడా సుప్రీంకోర్టు పిలుపిచ్చింది. నిజానికి ఇపుడు సుప్రీంకోర్టు చెప్పిన ప్రైవేటు జైళ్ళ నిర్మాణం చాలా మంచి ఆలోచనే. డబ్బులుండి ఎంతైనా ఖర్చులు పెట్టుకోగలిగిన వారు ప్రైవేటు జైళ్ళల్లో ఉంటారు. ఇపుడున్న జైళ్ళన్నీ దశాబ్దాల క్రితం కట్టినవే.

అందుకనే వాటిలో సౌకర్యాలు పెద్దగా ఉండవు. పైగా మనదేశంలో కేసుల విచారణ పేరుతోనే లక్షలమంది నిందితులను జైళ్ళల్లోనే పెట్టేస్తున్నారు. జైళ్ళ నుండి విడుదలయ్యేవారికన్నా లోపలకు వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇందుకనే ఏ జైలులో చూసినా ఖైదీలు దాని కెపాసిటికి మించే ఉంటున్నారు. దీనివల్ల జైలు లోపల కనీస సౌకర్యాలు కూడా సరిగా ఉండటం లేదు. జైలు గదులు, బాత్ రూములు, భోజనానికి, వంటకు అన్నింటికీ ఇబ్బందులుగానే ఉంటున్నది.

ఇదే ప్రైవేటు జైలు అయితే నిర్మాణం, నిర్వహణ అంతా కార్పొరేట్ సంస్ధలే చూసుకుంటాయి. కాబట్టి అత్యాధునిక సౌకర్యాలుంటాయనటంలో సందేహంలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ మాల్యా కూడా విచారణ సందర్భంగా జైళ్ళలో సౌకర్యాలు సరిగా ఉండవు కాబట్టి తాను భారత్ వెళ్ళనని బ్రిటన్ కోర్టులో చెప్పిన విషయం తెలిసిందే.