బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో రిషి సునాక్‌.. గోపూజ‌

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న రిషి సునాక్ సతీ సమేతంగా గో పూజ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయనను బ్రిటన్‌లోని భారతీయ మూలాలుగలవారంతా ప్రశంసిస్తున్నారు. ఇది ఘనమైన భారతీయ సాంస్కృతిక వారసత్వమని, మనకు గర్వకారణమని చెప్తున్నారు. అయితే.. ఇదంతా కూడా బ్రిట‌న్‌లోని భార‌తీయ మూలాలు ఉన్న వారిని త‌న‌వైపు తిప్పుకొనే ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌గా.. ప్ర‌త్య‌ర్తులు చెబుతున్నారు.

మ‌రోవైపు రిషి సునాక్ మాత్రం.. దైవ బ‌లం ఎవ‌రికైనా అవ‌స‌ర‌మేన‌ని.. అందుకే.. తాను గోపూజ చేశాన‌ని అన్నారు. కాగా, రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తి వేదాంత మేనర్ దేవాలయంలో పూజలు చేశారు. దీనిలో భాగంగా దంపతులిద్దరూ గో పూజ చేసి, హారతి ఇచ్చారు. ఈ వీడియోలను, ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

రిషి సునాక్ గత ఏడాది దీపావళి పండుగను తన అధికారిక నివాసంలో జరుపుకున్నారు. నూనె దీపాలను వరుసగా వెలిగించారు. దీంతో భారతీయులంతా ఆయనను మెచ్చుకున్నారు. ఈ ప‌రిణామంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంద‌నే విశ్లేష‌ణ‌లు కూడా ఉన్నాయి.

ఇదిలావుండగా, బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న పోటీలో రుషి సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ కన్నా వెనుకబడి ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో భారత సంతతి ప్రజలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు సుమారు 2.5 శాతం మంది. బ్రిటన్ జీడీపీలో 6 శాతం వీరి ద్వారా లభిస్తోంది. 2021లో ఇండియన్ కంపెనీలు 805 ఉండేవి, 2022లో వీటి సంఖ్య 900కు పెరిగింది. భారతీయుల విజయం వెనుక రుషి ఉన్నారు.