భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఒక ఉగ్రవాదికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎండోర్స్ చేయడమే ఇందుక్కారణం. ఐతే తన పోస్టు తీవ్ర దుమారం రేపడంతో హర్భజన్ వెంటనే తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఖలిస్థాన్ టెర్రరిస్టు బృంద్రాన్వాలే గురించి తనకు ఫార్వర్డ్ అయిన ఒక పోస్టర్‌ను హర్భజన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. అందులో బృంద్రాన్వాలే అమర వీరుడని పేర్కొన్నారు. ఐతే ఇండియాకు వ్యతిరేకంగా పని చేయడమే కాక.. 80వ దశకంలో దేశాన్ని విభజించడానికి కుట్రలు పన్నిన ఉగ్రవాది బృంద్రాన్వాలేను అమర వీరుడిగా పేర్కొనడం చాలామందికి నచ్చలేదు. హర్భజన్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అతణ్ని ట్రోల్ చేశారు. కొందరు జర్నలిస్టులు సైతం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఐతే ఇది పెద్ద వివాదంగా మారుతుండటంతో హర్భజన్ స్పందించాడు.
తనకు వాట్సాప్‌లో ఎవరో ఫార్వర్డ్ చేసిన పోస్టును సరి చూసుకోకుండా షేర్ చేశానని.. ఇది ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తీసి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని హర్భజన్ అన్నాడు. తాను క్రికెటర్‌గా 20 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. అందుకోసం ఎంతో శ్రమించానని.. అలాంటిది దేశానికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడూ చేయనని హర్భజన్ అన్నాడు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి కూడా మద్దతుగా నిలిచేది లేదని అతను స్పష్టం చేశాడు. హర్భజన్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో తెరపడినట్లే అనుకోవాలి. కానీ కొందరు మాత్రం హర్భజన్ కేవలం బృంద్రాన్వాలేపై పోస్టును ఫార్వార్డ్ చేయడంతో సరిపెట్టలేదని, దానికి ‘ప్రణామ్ షహీద్ ను’ అనే కామెంట్ కూడా జోడించాడని, బృంద్రాన్వాలేను అంత గౌరవంగా సంబోధించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates