కరోనా వైరస్ తీవ్రత రాబోయే మే నెలలో మరింత భయంకరంగా ఉండబోతోందా ? అవుననే అంటున్నారు అమెరికా మిషిగన్ యూనివర్సిటిలోని అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి కారణంగా యావత్ దేశమంతా వణికిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. ప్రపంచంలో మరేదేశంలో లేనంతగా ఇక్కడ రోజుకు 3.35 లక్షల కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్షలాది కేసులు నమోదవుతాయని ఎవరు అంచనా వేయలేదు.
కరోనా వైరస్ తీవ్రతతో పాటు ఆక్సిజన్ అందక కూడా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత పెరిగిపోవటానికి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పాటు జనాల అలసత్వం కూడా కారణమనే చెప్పాలి. అయితే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం వల్ల కేసులు పెరిగిపోతున్నాయనే చర్చవల్ల ఉపయోగంలేదు. అందుకనే కేసులను ఎలా నియంత్రించాలనే విషయంతో పాటు టీకాల ఉత్పత్తి, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా విషయంపైనే దృష్టిపెట్టాలి.
ఇక్కడే కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు బాధ్యతలను మరచి కీచులాడుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే భ్రమర్ ముఖర్జీ పెద్ద బాంబు వేశారు. ప్రొఫెసర్ అంచనా ప్రకారం మే మొదటివారానికి కరోనా విజృంభణ అత్యంత గరిష్టానికి చేరుకుంటుందట. అప్పటికి ప్రభుత్వం ప్రకటించే లెక్కలే రోజుకు కేసుల సంఖ్య 10 లక్షలు, మరణాలు 5వేలకు చేరుకునే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నమూనాల సాయంతో ప్రొఫెసర్ పై ఆందోళన వ్యక్తంచేశారు.
మేలో కేసులు, మరణాల సంఖ్య అత్యధికంగా పెరిగిపోయి మళ్ళీ ఆగస్టునాటికి తగ్గే అవకాశాలున్నాయని కూడా అంచనా వేశారు. భారత్ లో రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలుగా ప్రకటిస్తున్నా పరిస్దితులు ఇంతకన్నా దారుణంగా దిగజారిపోవటం ఖాయమన్నారు. ఎక్కడికక్కడ లాక్ డౌన్లు విధించటం, మాస్కులు ధరించటాన్ని తప్పనిసరిచేయటం, భారీ సమూహాలను నిషేధించటం, అంత రాష్ట్ర ప్రయాణాలను నియంత్రించటం, వ్యాక్సినేషన్ పెంచటం లాంటి చర్యల వల్ల సమస్యను కంట్రోల్ చేయవచ్చని కూడా సూచించారు. మరి ప్రభుత్వాలు, జనాలు పాటించాలికదా.