మనిషి చనిపోతే వారిని ఈ లోకం నుంచి సాగనంపే విషయం ప్రతి మతానికీ ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు ఆయా మతస్థులు. చివరి గడియల్లో వెంట ఉండాలని.. చనిపోయిన మనిషిని చివరి చూపు చూసుకోవాలని.. దగ్గరుండి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకాలని కుటుంబ సభ్యులే కాదు.. సన్నిహితులందరూ ఆశిస్తారు. వీటన్నింటికీ అవకాశం ఇవ్వని బాధాకరమైన చావును ఇస్తుంది కరోనా.
వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి ఎవరూ వెళ్లలేరు. ఇక ఆ వ్యక్తి చనిపోతే.. కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించరు. సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు చేయనివ్వరు. అనాథ శవంలా తీసుకెళ్లి సామూహిక ఖననం చేయాల్సిన దుస్థితి.
కనీసం శ్మశాన వాటికలో ఒక పద్ధతి ప్రకారం మృతదేహాన్ని ఖననం చేసే పరిస్థితి కూడా లేక ఖాళీ ప్రదేశాలు చూసి సామూహిక ఖననాలు చేసేస్తున్న పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల నెలకొన్నాయి. అసలే శ్మశాన వాటికల కొరత ఉన్న పెద్ద నగరాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కరోనా మృతుల ఖననం జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోక మానదు. దేశ రాజధాని ఢిల్లీలో తీసిన ఒక ఫొటో చూస్తే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది.
ఏరియల్ వ్యూలో తీసిన ఆ ఫొటోలో.. ఒక ఖాళీ ప్రదేశంలో ఒక్కో మృత దేహానికి కొన్ని అడుగుల ఖాళీ వదిలి ఒకేసారి దహనం చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. పదుల సంఖ్యలో మృతదేహాలు దహనం అవుతున్నాయి. ఇలా ఒకేసారి అన్నిమృత దేహాల్ని ఒకే చోట కాల్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే కరోనా ఏ స్థాయిలో విలయ తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటో చూస్తే ఒళ్లు జలదరించడం, హృదయం ద్రవించడం ఖాయం.