చూసినంతనే ఆకట్టుకునే రూపం. దానికి తగ్గట్లు ఆహార్యం.. స్టైల్ గా ఉండే ఆమె చేసిన మోసం గురించి తెలిసిన పోలీసులు సైతం షాక్ తింటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటమే కాదు.. ఒక వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు నాకించేసిన వైనం సంచలనంగా మారింది.
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జల్సాలకు అలవాటు పడిన శ్రుతి సిన్హా.. తనను తాను ఐపీఎస్ అధికారిణిగా చెప్పుకుంటుంది. నకిలీ ముసుగు వేసుకొని.. తన మాటలతో బోల్తా కొట్టించే ఆమెకు వీరారెడ్డి అనే వ్యాపారి అడ్డంగా బుక్ అయ్యారు.
పరిచయం.. పెళ్లి చేసుకోవాలన్న కమిట్ మెంట్ పేరుతో సదరు వ్యాపారి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు నాకించేసింది. తర్వాత హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె అసలు ఐపీఎస్ అధికారిణే కాదన్న విషయాన్ని తెలుసుకున్న సదరు వ్యాపారి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె గురించి ఆరా తీసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సాయం చేసే మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
ఆమె వద్ద నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తులు.. డెబిట్ కార్డులు.. ఖరీదైన కార్లు.. విల్లాను స్వాధీనం చేసుకున్నారు. అయినా.. వెనుకా ముందు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటామనే మహిళకు రూ.11 కోట్లు ధారాదత్తం చేయటమా? అని అవాక్కు అవుతున్నారు. పెళ్లి అన్నంతనే.. ఎంత కట్నం అనటం మానేసి.. అమ్మాయికి ఎదురు డబ్బులు ఇచ్చే తీరు ఇప్పుడు అవాక్కు అయ్యేలా చేస్తుంది.