వినేందుకే ఒళ్లు జలదరించే ఈ వైనం సంచలనంగా మారింది. ఊహకు అందని రీతిలో భర్త మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించిన భార్య వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ శివారులోచోటు చేసుకున్న ఈ ఉదంతం వింటే.. ఎంత కోపం ఉంటే మాత్రం.. మరీ ఇంతలా చేయాలా? అన్న సందేహం కలుగక మానదు. సలసలా కాగుతున్న నూనెను భర్త మీద పోయటమే కాదు.. దాని మీద కారం చల్లిన వైనం వింటే షాక్ కు గురి కావాల్సిందే. హైదరాబాద్ మహానగరశివారులోని కుత్భుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
హుస్నాబాద్ కు చెందిన సదయ్య.. రజిత దంపతులు కొద్దికాలం క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. నగర శివారు జగద్గిరి గుట్ట దీనబందు కాలనీలో నివాసం ఉంటారు. కూరగాయల వ్యాపారం చేసే అతనితో విభేదాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారం క్రితమే భర్త వద్దకు వచ్చింది. తర్వాత కూడా భార్య.. భర్తల మధ్య విభేదాలు.. తగాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సదయ్య తలుపు తీయమని కోరినా తీయలేదు. ఇంట్లో ఉన్న భార్య.. కుమార్తెలు ఇంటికి తాళం వేసుకొని ఉన్నారు. దీంతో.. పక్కింటి నుంచి తన ఇంట్లోకి వెళ్లాడు. భర్త మీద అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య.. కాగుతున్న నూనెను సదయ్య మీద పోసింది. అక్కడితో ఆగకుండా కారం మీద చల్లారు. దీంతో.. బాధ భరించలేక హాహాకారాలు చేయసాగాడు.
చుట్టుపక్కల వారు స్పందించి.. ఇంటికి చేరుకునే లోపలే భార్య.. పిల్లలు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఎందుకిలా జరిగిందన్న వైనంపై వివరాలు సేకరిస్తున్నారు. కట్టుకున్న భర్తపై ఇంత అమానుషంగా ఎందుకు వ్యవహరించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates