ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన.. 16 ఏళ్ల బాలికపై…

దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4 రాత్రి కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. కుటుంబ సభ్యులతో గొడవ నేపథ్యంలో నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్‌ నోయిడాలోని పరిచౌక్‌ వద్ద స్లీపర్‌ బస్సు ఎక్కిన బాలికపై డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

బస్సులోని స్లీపర్‌ బెర్త్‌లకు తెరలు ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయటివారికి కనిపించలేదని సమాచారం. అనంతరం బాలికను ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ బస్‌ స్టాండ్‌ వద్ద దింపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్‌ బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాలికపై జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది.