ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన ‘డీజే సౌండ్’ వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన ఘట్టంలో డీజే పెట్టగా.. ఇద్దరు యువకులు డ్యాన్స్ చేస్తూ.. ఆ శబ్ద హోరుకు గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి వయసు.. 35 ఏళ్లలోపేనని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో గురువారం సాయంత్రం నిర్వహించిన నిమజ్జనోత్సవంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ డీజే వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది.
అసలేంటీ డీజే?
డీజే.. అంటే డిస్క్ జాకీ అని అర్థం. సాధారణ శబ్దాల కంటే అత్యధిక డెసిబెట్స్, భారీ ధ్వని తరంగాలు దీనివల్ల ఏర్పడుతాయి. సాధారణంగా శుభకార్యాలు, పండుగలు, రాజకీయ ఊరేగింపుల్లో వినోదం కోసం వీటిని వాడుతుంటారు. అయితే, ఇది పరిమితికి మించి ఉండటం వల్ల మనుషుల ప్రాణాలకే ప్రమాదకరంగా మారుతోంది. గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. డీజే నుంచి వచ్చే భారీ బేస్ ధ్వని తరంగాలు గుండె కొట్టుకునే వేగాన్ని అకస్మాత్తుగా పెంచుతాయి.
ఇది బలహీనమైన గుండె ఉన్నవారిలో లేదా వృద్ధుల్లో కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటుకు దారితీస్తుంది. అదేసమయంలో రక్తపోటు పెరిగిపోతుంది. శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇక, డీజే కారణంగా.. వినికిడి శక్తి దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా మనుషులు 60 నుండి 70 డెసిబెల్స్ శబ్దాన్ని మాత్రమే తట్టుకోగలరు. కానీ డీజే సౌండ్స్ 100 నుండి 120 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటాయి.
ఇంతటి భారీ శబ్దాన్ని వినడం వల్ల చెవిలోని ఇంటర్నల్ హెయిర్ సెల్స్ దెబ్బతిని శాశ్వతంగా చెముడు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . డీజే శబ్దాల తర్వాత చెవుల్లో నిరంతరం ‘రింగ్’ అనే శబ్దం లేదా ఈల వేసినట్లు వినిపించే జబ్బు వస్తుంది. అదేసమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. డీజే శబ్దాల వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ఆందోళన, చిరాకు, ఒత్తిడిని పెంచుతుంది.
ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి.?
నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాలలో డీజేని వినియోగించరాదు. ఒకవేళ వినియోగించినా.. పగటిపూట 55 డెసిబెల్స్ సౌండ్ మించరాదు.(సాధారణంగా 70 వరకు వాడొచ్చు). ఇక, రాత్రి పూట 45 డెసిబెల్స్ మాత్రమే శబ్దం ఉండాలి. అలాగే రాత్రి 10 గంటల తర్వాత లాడ్‌స్పీకర్లు, డీజేల వాడకంపై నిషేధం ఉంది. ఏపీ విషయానికి వస్తే.. వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారంలో తిరుపతిలో కూడా డీజే సౌండ్ ఎఫెక్ట్‌కు 50 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే గుండె ఆగిచనిపోయారు. తాజాగా ఇద్దరు యువకులు కన్నుమూశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates