వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ మన హైదరాబాద్‌కు రాబోతోందనే వార్త నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఆకర్షణీయమైన మల్టీప్లెక్సులు కడుతున్న ఏషియన్ సంస్థ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఈ రికార్డ్ బ్రేకింగ్ స్క్రీన్‌ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తీసుకురాబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. దీంతో సినిమా అంటే పడిచచ్చే ఇక్కడి ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.
ఇంతకీ ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది.. అది ఏ ఫార్మాట్ అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ జర్మనీలోని ట్రాంపాలాస్ట్ లియోన్‌బర్గ్‌లో ఉంది. అక్కడి స్క్రీన్ సైజు ఏకంగా 127 అడుగుల (39 మీటర్లు) వెడల్పు, 69 అడుగుల (21 మీటర్లు) పొడవు ఉంటుంది. ఆ థియేటర్ విస్తీర్ణం.. 8,770 చదరపు అడుగులు. ఇక్కడ 574 రిక్లైనర్ సీటింగ్ ఉంది. ఇంత పెద్ద స్క్రీన్ అంటే అది ఐమాక్స్ ఫార్మాట్ థియేటర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐమాక్స్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్‌తో థియేటర్ నడుస్తోంది.
ప్రపంచంలో అత్యంత వెడల్పైన స్క్రీన్ ఇదే కాగా.. పొడవులో మాత్రం దీన్ని బీట్ చేసే థియేటర్ అమెరికాలో ఉంది. జార్జియాలోని రాయల్ సినిమాస్ స్క్రీన్ పొడవు 76.2 అడుగులు. ఆ స్క్రీన్ పొడవు 101 అడుగులు. ఆ థియేటర్లో 363 రిక్లైనర్ సీట్లున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ తీసుకొస్తున్నారు అంటే అది జర్మనీలో ఉన్న దాని కంటే ఎక్కువగా 130 అడుగుల వెడల్పుకు తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. పొడవులో అమెరికన్ థియేటర్‌ను కూడా బీట్ చేసే అవకాశముంది.
ఈ భారీ స్క్రీన్ ఆటోమేటిగ్గా ఐమాక్స్ ఫార్మాట్లోనే ఉండబోతోందన్నది స్పష్టం. అధికారిక ప్రకటన వచ్చేసింది అంటే.. త్వరలోనే పనులు మొదలవుతాయన్నమాటే. ఇంకో రెండు మూడేళ్లలో ఈ స్క్రీన్ అందుబాటులోకి రావచ్చని ఆశించవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అభివృద్ధిని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అక్కడ అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తుున్నారు. ఈ టర్మ్ అయ్యేలోపు ఆ ప్రాంతాన్ని గచ్చిబౌలి తరహాలో కొత్త సిటీగా మార్చాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ నిర్మాణానికి భూమిని కేటాయించినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates