ఈ క్రికెటర్ ప్రాబ్లం ఏంటి?

ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం? క్రమశిక్షణ, పట్టుదల లేకపోతే ఆ ప్రతిభ సరైన దారిలో వెళ్లదు. ఇందుకు ముంబయి క్రికెటర్ పృథ్వీ షా కెరీరే ఉదాహరణ. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈ కుర్రాడు.. స్కూల్ క్రికెట్లో, దేశవాళీల్లో సంచలన ప్రదర్శనలతో, రికార్డులతో టీనేజీలోనే భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టడమే కాదు.. సచిన్ తర్వాత అత్యంత చిన్న వయసులో అరంగేట్రంలోనే టెస్టు సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గానూ నిలిచాడు.

దీంతో ఇండియన్ క్రికెట్లో మరో సచిన్ అయిపోతాడని అతడి మీద అంచనాలు కలిగాయి. ఐపీఎల్‌లో సైతం అతను తనదైన ముద్ర వేశాడు. కానీ ఏం లాభం? చిన్న వయసులో వచ్చిన ఫేమ్‌ను తలకు ఎక్కించుకుని కష్టపడడం మానేయడం, క్రమశిక్షణ తప్పడంతో కొన్నేళ్లలోనే ఫేడవుట్ అయిపోయాడు.

గాయంతో భారత జట్టుకు దూరమైన వాడు.. తిరిగి మళ్లీ టీంలోకి రాలేదు. క్రమశిక్షణ లేక చిన్న వయసులోనే విపరీతంగా బరువు పెరిగిపోవడం.. అనవసర వివాదాల్లో తలదూర్చడం, దురుసు ప్రవర్తనతో.. దేశవాళీ క్రికెట్లో కూడా నిలదొక్కుకోలేకపోయాడు. ఒకప్పుడు పదికోట్ల దాకా రేటు పెట్టి అతణ్ని ఐపీఎల్ జట్లు కొనడానికి ప్రయత్నించాయి. అలాంటిది ఇప్పుడు ఏ ఐపీఎల్ టీం కూడా అతణ్ని బేస్ ప్రైస్‌కి కూడా కొనని పరిస్థితి. చివరికి ముంబయి రంజీ జట్టులో కూడా అతను చోటు కోల్పోయాడు. వ్యక్తిగత జీవితంలో కూడా పృథ్వీ తరచుగా వివాదాల పాలవుతూనే ఉన్నాడు.

రోడ్డు మీద ఒక అమ్మాయితో గొడవ పడడంతో మొదలుపెడితే.. ఇప్పుడు తన ప్రేయసి ఆకృతి అగర్వాల్‌తో విభేదాలు వచ్చి ఎంగేజ్మెంట్ రద్దయ్యే వరకు ప్రతిసారీ నెగెటివ్ వార్తతోనే అతను హైలైట్ అవుతున్నాడు. ఎంతో ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి కూడా పెళ్లికి నో చెప్పి వెళ్లిపోవడంతో పృథ్వీ షా క్యారెక్టర్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఒక వ్యక్తికి ఎంత ప్రతిభ ఉన్నా.. క్రమశిక్షణ లేకపోతే, ప్రవర్తన బాలేకుంటే ఏం జరుగుతుందో చెప్పడానికి పృథ్వీ షా కెరీరే ఉదాహరణ.