ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో డిజిటల్ రిలీజ్ చేసారు. ఎలాగూ శుక్రవారం ప్యారడైజ్ వచ్చేస్తుంది కాబట్టి రవితేజ దూకుడుకి నాని బ్రేక్ వేయడానికి రెడీ అవుతున్నట్టే. అయితే స్మార్ట్ టీవీ, మొబైల్స్ లో ఇరుముడిని చూసిన వాళ్ళ నుంచి కాస్త విభిన్నమైన అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలా ఎందుకు జరుగుతోందనేది ఒక విశ్లేషణ చేద్దాం.

ఎప్పటికైనా థియేటర్ ద్వారా పొందే అనుభూతికి టీవీ లేదా స్మార్ట్ ఫోన్ సాటి రాదు. ఉదాహరణకు ముత్యాల పల్లకి పాటకు జనాలు మొత్తం వైబ్ అయిపోయి స్క్రీన్ దగ్గర డాన్సులు చేశారు. అవి చూస్తూ డాల్బీ సౌండ్ లో ఎక్స్ పీరియన్స్ అవ్వడం వేరే లెవెల్ లో ఉంటుంది. ఆటోలో ఛేజులు చేసినప్పుడు, అసలు హంతకుడు ఎవరనేది రివీల్ అయినప్పడు, క్లైమాక్స్ లో మెయిన్ విలన్లను రవితేజ శిక్షించే ఎపిసోడ్ మొదలైనవి వందలాది జనాల మధ్యలో కూచుని చూస్తేనే కనెక్ట్ అవుతాయి.

అలాని ఇరుముడి ఏ మాయాబజారో లేదా షోలే లాంటి క్లాసిక్ కాదు. దర్శకుడు శివ నిర్వాణ చేసిన పొరపాట్లు, వదిలేసిన లాజిక్కులు చాలానే ఉన్నాయి. అయితే తెరమీద మేజిక్ జరిగిపోవడంతో ఆడియన్స్ ఈ మైనస్సులను పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు అంత లోతుగా వీటి గురించి ఆలోచించలేదు. అన్నింటికన్నా ముఖ్యంగా థియేటర్ నుంచి బయటికి వచ్చాక స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ ఇరుముడి స్థాయిని కొన్ని వందలరెట్లు పెంచింది.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఉప్పెన, మిరాయి, మన శంకరవరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం, జాతి రత్నాలు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ చిన్న తెరపై వచ్చిన తర్వాత మిక్స్డ్ రియాక్షన్స్ చవి చూశాయి. ఇప్పుడు ఇరుముడికీ అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా ఇదసలు విషయమే కాదు. థియేటర్లో ఆడి, రికార్డులు సృష్టించి, రెండు వందల కోట్ల వసూళ్లను దాటేసిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు కొత్తగా బాగుంది.. బాలేదని సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదు.