ఇప్పటికే టెస్ట్, టీ20 లకు దూరమైన హిట్ మ్యాన్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ మొదలైంది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలోనూ అతను కేవలం 11 పరుగులే చేశాడు. ఇక వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌కు జులై 19న జరిగే మూడో వన్డేనే ఈ ఫార్మాట్‌లో చివరి మ్యాచ్ కావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ కోసం జట్టును ప్రకటించినప్పటి నుంచే అతని భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన 39 ఏళ్ల రోహిత్ అప్పటివరకు జట్టులో కొనసాగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. గత 8 వన్డే మ్యాచ్‌లలో రోహిత్ ఒక హాఫ్ సెంచరీతో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లలో అతని సగటు 30.1, స్ట్రైక్ రేట్ 88.6 గా ఉంది. మూడు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు చేసిన జైస్వాల్‌కు కనీసం 20 వన్డేల పాటు సుదీర్ఘ అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్ నుంచి భవిష్యత్తు వైపు చూడాలని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ ప్రకటించమని ఎవరూ రోహిత్‌కు నేరుగా చెప్పలేరని, ఆ నిర్ణయం అతనికే వదిలేశామని ఎంపిక వ్యవహారాలు తెలిసిన ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అజ్ఞాతంగా నేషనల్ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టూర్ తర్వాత అతని స్థానంలో వేరే వారిని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని సెలెక్టర్లు రోహిత్‌కు చెప్పినట్లు సమచారం.
కార్డిఫ్‌లో ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం రోహిత్ వన్డే కెరీర్‌పై ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీ ఫామ్, ఫిట్‌నెస్ బాగుండటంతో అతన్ని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఎంచుకున్నా, రోహిత్ విషయంలో మాత్రం అలా లేదని వార్తలు వస్తున్నాయి. తన ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని ఆటను కొనసాగించాలని రోహిత్ భావించినా, నివేదికల ప్రకారం వస్తున్న ఈ వార్తలతో అతను అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సిరీస్ మధ్యలోనే అతను కొందరు బీసీసీఐ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.
గతంలో రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ సమయంలో కూడా సెలెక్టర్లకు, అతనికి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో కేవలం 2 మ్యాచ్‌ల తర్వాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లు భావించినట్లు అప్పట్లో టాక్ నడిచింది. కానీ తాను కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని అనుకోలేదని, సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉన్నానని రోహిత్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు వన్డేల విషయంలోనూ సెలెక్టర్ల ప్రణాళికలు ఇలా ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో రోహిత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates