ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్‌ (మెదడు వాపు) కేసుల్లో 35 మందికి చాందిపుర వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఏడుగురు చిన్నారులు ఐసీయూలో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

చాందిపుర వైరస్‌ ప్రధానంగా ఇసుక ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌ సోకిన వెంటనే తీవ్ర మెదడు వాపుకు దారితీసే అవకాశం ఉండటంతో చిన్నారుల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు నిర్దిష్ట ఔషధం లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదని, రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు గ్రామాల వారీగా పర్యటిస్తూ పిచికారీ చర్యలు చేపడుతున్నాయి. ప్రతి కేసును గుర్తించి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

చిన్నారులకు జ్వరం, వాంతులు, మూర్ఛ, స్పృహలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తరలించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెంచడం, వేగంగా చికిత్స అందించడం ద్వారానే మరణాలను తగ్గించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.